ఎన్నికల్లో సానుభూతి కోసమే బాలినేని నాటకాలు: దామచర్ల జనార్దన్

  • ఒంగోలులో గత రాత్రి వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ
  • నగరంలో తీవ్ర ఉద్రిక్తత
  • కుల రాజకీయాలు బాలినేనికి అలవాటేనన్న టీడీపీ అభ్యర్థి దామచర్ల
ప్రకాశం జిల్లా ఒంగోలులో గతరాత్రి వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకోవడం తెలిసిందే. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం చేస్తుండగా, ఆమెను ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు  అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి వైసీపీ, టీడీపీ వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లింది. 

బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు, టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ కూడా రంగంలోకి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ దాడుల్లో ఇరుపార్టీలకు చెందిన వారు గాయపడగా... బాధితులను పరామర్శించేందుకు బాలినేని, దామచర్ల ఒంగోలు రిమ్స్ వద్దకు వెళ్లగా, వీరి రాకతో అక్కడ ఉన్న రెండు పార్టీల కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు చేశారు. రిమ్స్ వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తీవ్రంగా శ్రమించి ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కడ్నించి పంపించివేశారు. 

ఈ నేపథ్యంలో, ఇవాళ కూడా బాలినేని, దామచర్ల జనార్దన్ మీడియా ఎదుట తీవ్రస్థాయిలో స్పందించారు. దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ... ఎన్నికల్లో సానుభూతి కోసం బాలినేని నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బాలినేని కోడలు ప్రచారానికి వెళ్లి కరపత్రాలు ఇచ్చారని తెలిపారు. బాలినేని గత ఎన్నికలకు ముందు ఒంగోలు కమ్మపాలెంలో ఉద్రిక్తతలు సృష్టించారని, ఈసారి సమతానగర్ లో గొడవలు సృష్టించారని ఆరోపించారు. 

కుల రాజకీయాలు చేసి కేసులతో ఇబ్బంది పెట్టడం బాలినేనికి అలవాటేనని దామచర్ల జనార్దన్ విమర్శించారు. చికిత్స కోసం బాధితులను ఆసుపత్రిలో చేర్చినా దౌర్జన్యం చేస్తున్నారని మండిపడ్డారు. 

కాగా, ఒంగోలు సమతా నగర్ లో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన 40 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.


More Telugu News