వాలంటీర్లకు మేలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తుంటే సజ్జలకు ఏంటి నొప్పి?: వర్ల రామయ్య ఫైర్
- వాలంటీర్ల విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
- వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామన్న చంద్రబాబు
- చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మొద్దన్న సజ్జల
- నువ్వొక సలహాదారుడిగా... ఏంటి నువ్విచ్చేది బొంద సలహాలు అంటూ వర్ల ఫైర్
ఏపీలో వాలంటీర్ల అంశంలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వాలంటీర్లకు రూ.10 వేల వేతనం ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుండగా, వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. చంద్రబాబు మాటలు నమ్మొద్దని, గతంలోనూ చంద్రబాబు ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చారని సజ్జల ధ్వజమెత్తారు. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు.
వాలంటీర్లకు రూ.10 వేలు ఇస్తామంటే సజ్జలకు ఏంటి నొప్పి? అని ప్రశ్నించారు. వాలంటీర్లకు మేలు చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని, అందులో సజ్జల తప్పుబట్టాల్సింది ఏముంది? అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. వాలంటీర్లను మీరు బానిసల మాదిరిగా వాడుకున్నారని ఆరోపించారు.
మేం గౌరవప్రదంగా చూసుకుంటామంటే హేళన చేస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకూడదు కానీ... నీకు బుద్ధి, జ్ఞానం ఉండొద్దూ... నువ్వొక సలహాదారుడివా? ఏం సలహాలు నువ్విచ్చేది... బొంద సలహాలు? అంటూ సజ్జలపై వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. ఏం... నీ తాత సొమ్ము ఏమైనా ఇస్తున్నావా, నీ జేబులో సొమ్ము ఇస్తున్నావా? నాన్సెన్స్... వాళ్ల ఆత్మగౌరవాన్ని కూడా మీకు తాకట్టు పెట్టారే... అలాంటి వాలంటీర్లను బానిసల్లా చూస్తారా? నువ్వు, నీ నాయకుడు, నీ పార్టీ వాలంటీర్ల పట్ల ప్రజల్లో ఏహ్యభావం కలిగేట్టు చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు.
వాలంటీర్లు మా వాళ్లు అంటూ బొత్స, ధర్మాన, ఏ2 విజయసాయిరెడ్డి వాళ్లపై ఒక ముద్ర వేసేశారు... అందుకే వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా... ఈ సజ్జలను నమ్మొద్దు, ఈ జగన్ ను నమ్మొద్దు, ఆ ఏ2ను నమ్మొద్దు... చరిత్ర తెలుసు కదరా బాబూ... వీళ్లందరికీ టైమ్ దగ్గరికొచ్చింది... వీళ్లపై ఉన్న కేసుల విచారణ సజావుగా సాగితే ఈ బ్యాచ్ అంతా శ్రీకృష్ణుడి జన్మస్థానంలో ఉంటారు... వీళ్లకు ఆఖరి మజిలీ అదే... అంటే చెరసాల... జైల్! అది చర్లపల్లి అవుతుందా, రాజమండ్రి సెంట్రల్ జైలు అవుతుందా అనేది చెప్పలేను కానీ... చెరసాల మాత్రం ఖాయం! అని వర్ల రామయ్య స్పష్టం చేశారు.
వాలంటీరు సోదరులు ఒక్కసారి ఆలోచించాలి... చంద్రబాబు, జగన్ ఆలోచనా తీరును గమనించండి... పరిపాలనా తీరు చూడండి. జగన్ మిమ్మల్ని బానిసల్లా వాడుకున్నాడు... చంద్రబాబు ఉగాది రోజు మీ గురించే మాట్లాడారు... వాలంటీర్లు గౌరవప్రదంగా ఉండాలి, మీ వేతనం పెంచుతామని చెప్పారు... జగన్ ఎప్పుడైనా వాలంటీర్లు గౌరవప్రదంగా ఉండాలని చెప్పాడా? అంటూ వర్ల రామయ్య పేర్కొన్నారు.
సజ్జలా ఇక నువ్వు తగ్గు... తీసుకునేదేమో ప్రజల డబ్బు... చేసేదేమో జగన్ సేవా? అంటూ ప్రశ్నించారు. సజ్జల ఓసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి... నీకు నీతినిజాయతీ ఉంటే ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి జగన్ సేవ చేసుకోవాలి... కానీ జీతమేమో బాగానే దొబ్బుతావు... జగన్ కు, వైసీపీకి సేవ చేస్తావు... ఏం న్యాయం అయ్యా ఇది? ఏం మనిషివయ్యా నువ్వు? ... ఇది తప్పని మీ ఇంట్లో మీ శ్రీమతి చెప్పరా? రాజీనామా చేయ్ అని నీ భార్యాపిల్లలు చెప్పరా? కొడుకు కూడా అక్కడే ఉన్నట్టున్నాడు... ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు అతడు కూడా అదే చేస్తున్నాడు... అవినీతి సొమ్ములో అతడు కూడా పునీతం అవుతున్నాడు... మీ గురించి ఇంతకంటే నేను చెప్పలేనులే అంటూ వర్ల రామయ్య విమర్శనాస్త్రాలు సంధించారు.