బెడిసి కొట్టిన ఫన్నీ జవాబు.. రూ.8 లక్షల పరిహారం ఇచ్చిన కెనడా కంపెనీ

  • మ్యాక్ బుక్ స్కిన్ రంగు మారిందంటూ ఫిర్యాదు చేసిన భారతీయ యువకుడితో వ్యంగ్యం
  • కంపెనీ జవాబును ట్విట్టర్లో పెట్టిన బాధితుడు
  • వైరల్ గా మారడంతో దిగొచ్చి సారీ చెప్పిన కెనడా కంపెనీ
కస్టమర్లతో వ్యంగ్యంగా మాట్లాడితే భారీ మొత్తం వదులుతుందని కెనడా కంపెనీకి తెలిసొచ్చేలా చేశాడో భారత యువకుడు.. బహిరంగ క్షమాపణతో పాటు 10 వేల డాలర్లు (సుమారు రూ.8.34 లక్షలు) అందుకున్నాడు. చేతి చమురు వదిలినా ఆ కంపెనీ తగ్గేదేలే అనడం ఈ ఘటనకు కొసమెరుపు. పైపెచ్చు మా కస్టమర్లను ఆటపట్టించడం, వ్యంగ్యం చేయడం చాలా రోజులుగా చేస్తున్నామని, ఇకపైనా చేస్తామని ట్విట్టర్ లో స్పష్టం చేసింది. అంతేకాదు, తర్వాత 10 వేల డాలర్లు అందుకునేది మీరే కావొచ్చు అంటూ రెచ్చగొట్టేలా పేర్కొంది. ఈ ట్వీట్ కు నెటిజన్లు ఫన్నీగా రియాక్టవుతున్నారు. నా పేరు కూడా తప్పుగా పలకండి ప్లీజ్.. ఎందుకంటే నాక్కూడా పదివేల డాలర్లు కావాలంటూ ఓ యూజర్ కామెంట్ చేయడం హైలైట్ గా నిలిచింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..
కెనడాలో ఉంటున్న భారత సంతతి యువకుడు భువన్ చిత్రాంశ్ రెండు నెలల క్రితం డిబ్రాండ్ లో తన మ్యాక్ బుక్ కోసం స్కిన్స్ (స్టిక్కర్) ఆర్డర్ చేశాడు. అయితే, అది రెండు నెలల్లోనే రంగు మారింది. దీంతో డిబ్రాండ్ కంపెనీకి భువన్ కంప్లైంట్ చేశాడు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంపై డిబ్రాండ్ పై మండిపడుతూ ట్వీట్ చేశాడు. దీనికి డిబ్రాండ్ కంపెనీ కస్టమర్ సపోర్ట్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి భువన్ షాక్ కు గురయ్యాడు. తన కంప్లైంట్ కు మర్యాదగా బదులివ్వాల్సిన కంపెనీ.. తన ఇంటిపేరును కించపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది రేసిజమే (జాతివివక్ష) అని మండిపడుతూ, డీబ్రాండ్ రిప్లైని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

ఇది కాస్తా వైరల్ గా మారడం, నెటిజన్లు మండిపడుతుండడంతో డిబ్రాండ్ దిగొచ్చింది. భువన్ కు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో పాటు గుడ్ విల్ కింద 10 వేల డాలర్లు (మన రూపాయల్లో దాదాపు 8.34 లక్షలు) ఆఫర్ చేసింది. ఇక్కడితో ఆగిపోకుండా.. ఈ ఘటనపై వివరణ ఇస్తూ.. భువన్ ఇంటిపేరుతో ఫన్ చేసిన మాట వాస్తవమేనని అంగీకరించింది. ఆయన నొచ్చుకోవడంతో క్షమాపణ చెప్పినట్లు తెలిపింది. పదేళ్లుగా కస్టమర్లకు ఫన్నీగా జవాబిస్తున్నామని, ఇకముందు కూడా కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఏమో.. పది వేల డాలర్లు అందుకునే వంతు రేపు మీకు రావొచ్చేమో అంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది.


More Telugu News