2027 క్రికెట్ వ‌ర‌ల్డ్‌ క‌ప్‌కు ద‌క్షిణాఫ్రికాలోని 8 వేదిక‌ల ఖ‌రారు

  • 2027 ఐసీసీ వ‌ర‌ల్డ్‌ కప్‌కు ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, న‌మీబియా సంయుక్త ఆతిథ్యం
  • ఇందులో భాగంగా ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హించే 8 వేదిక‌ల‌ను ఖ‌రారు చేసిన ద‌క్షిణాఫ్రికా
  • సౌతాఫ్రికా ప్ర‌క‌టించిన వేదిక‌ల‌లో వాండరర్స్, న్యూలాండ్స్, సెంచూరియన్‌, డర్బన్‌
2027 ఐసీసీ వ‌ర‌ల్డ్‌ కప్‌కు ద‌క్షిణాఫ్రికాతో పాటు జింబాబ్వే, న‌మీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వ‌నున్నాయి. దీనిలో భాగంగా తాజాగా ద‌క్షిణాఫ్రికా ప్ర‌పంచ క‌ప్ నిర్వ‌హించే 8 వేదిక‌ల‌ను ఖ‌రారు చేసింది. న్యూస్24 దక్షిణాఫ్రికా నివేదిక ప్రకారం జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్, కేప్ టౌన్‌లోని న్యూలాండ్స్, సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, గ్కెబెర్హాలోని సెయింట్ జార్జ్ పార్క్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, రెయిన్‌బో నేషన్‌లో బ్లూమ్‌ఫోంటైన్‌లోని మాంగాంగ్ ఓవల్, తూర్పు లండన్‌లోని బఫెలో పార్క్‌ టోర్నమెంట్‌కు ప్రధాన వేదికలుగా ఉంటాయని తెలిసింది. ఇక‌ నమీబియా మినహా జింబాబ్వే, దక్షిణాఫ్రికా కటాఫ్ తేదీ వరకు ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ ఎనిమిది జట్లతో పాటు కో-హోస్ట్‌లుగా టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి.

ఈ సంద‌ర్భంగా క్రికెట్ దక్షిణాఫ్రికా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫోలేట్సీ మోసెకి మాట్లాడుతూ.. త‌మ దేశంలో ఐసీసీ గుర్తింపు పొందిన 11 వేదికలు ఉన్నాయ‌ని, వాటిలో కేవలం ఎనిమిది వేదికలను మాత్రమే ఇప్పుడు వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వహ‌ణ‌కు ఎంపిక చేసిన‌ట్లు తెలిపారు. మైదానాల‌కు సమీపంలో ఉన్న హోటళ్ల లభ్యత, విమానాశ్రయాలకు వాటి సామీప్యత వంటి విష‌యాల‌ను పరిగణనలోకి తీసుకుని ఈ వేదిక‌ల‌ను ఎంపిక చేసిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. 

"మాకు వాస్తవానికి ప‌ద‌కొండు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన వేదికలు ఉన్నాయి. వాటిలో మూడింటిని వదిలివేయడం చాలా కష్టం. కానీ చాలా విషయాలు పరిగణనలోకి తీసుకున్నాం. అందుబాటులో ఉన్న‌ వేదిక కంటే కూడా వాటిలో ఆట‌గాళ్ల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు దృష్టిలో పెట్టుకుని ప్ర‌పంచ‌క‌ప్‌కు వేదిక‌ల‌ను ఎంపిక చేశాం. బెనోని, జేబీ మార్క్స్ ఓవల్, డైమండ్ ఓవల్‌లోని వేదికలను మినహాయించాము" అని ఫోలేట్సీ మోసెకి తెలిపారు. 

ఇదిలాఉంటే.. 2027 ప్ర‌పంచ‌క‌ప్‌ మూడో ఆతిథ్య దేశ‌మైన‌ నమీబియా మూడేళ్ల‌ పాటు జరిగే ఎనిమిది జట్ల సీడబ్ల్యూసీ ఎల్‌2లో ఆడాల్సి ఉంటుంది. వీటిలో నాలుగు అగ్రశ్రేణి జట్లు క్వాలిఫైయర్‌లకు అర్హత సాధిస్తాయి. ఆపై ఇందులో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు నేరుగా వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడతాయి. ఇక న‌మీబియా ఇందులో అర్హ‌త సాధించ‌డం కొంచెం క‌ష్టమ‌నే చెప్పాలి. అందుకే టోర్నమెంట్‌లో ఈ ఆతిథ్య జ‌ట్టు పాల్గొనే అవ‌కాశాలు చాలా త‌క్కువ‌.


More Telugu News