నిడదవోలులో వారాహి వాహనంపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు

  • నిడదవోలులో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కల్యాణ్
  • పవన్ వారాహి గురించి చెబితే విన్నానే తప్ప, చూడ్డం ఇవాళే ప్రథమం అన్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నిడదవోలు ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన వారాహి వాహనం పైనుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "గత 40 ఏళ్లలో నిడదవోలుకు అనేక పర్యాయాలు వచ్చాను. ఇక్కడికి వచ్చిన ప్రజల ఉత్సాహం చూస్తుంటే మే 13న గెలవబోయేది ఎన్డీయే అని స్పష్టమవుతోంది. 

మొట్ట మొదటిసారిగా మూడు పార్టీల అధ్యక్షులం ప్రజలను చైతన్యవంతులను చేయడానికి ఇక్కడికి వచ్చాం. వారాహి నుంచి ప్రజాగళం వినిపిస్తున్నాం. మిత్రుడు పవన్ కల్యాణ్ వారాహి గురించి చెబుతుంటే విన్నాను కానీ, ఇవాళే చూస్తున్నాను. ఇక్కడ్నించి మూడు పార్టీల తరఫున సింహ గర్జన చేస్తున్నాం. ప్రజాగళాన్ని వినిపిస్తున్నాం. ఇప్పుడే తణుకులో నేను, పవన్ కల్యాణ్ గారు రోడ్ షో చేశాం... అదిరిపోయింది. ఇప్పుడు నిడదవోలు దద్దరిల్లిపోయింది. ఇది చూస్తే జగన్ కు నిద్ర రాదు... గుండె పగలిపోవడం ఖాయం. 

సినిమాల్లో పవర్ స్టార్ గా ఉన్న వ్యక్తి పవన్ కల్యాణ్... నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు, భారత్ ను ప్రపంచపటంలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న మోదీ ఉన్నారు... నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు చెప్పండి... మనకు జగన్ ఓ లెక్కా? 

జగన్ మోహన్ రెడ్డి ఎక్కడో సిద్ధం సిద్ధం అని తిరుగుతున్నాడు... నిడదవోలు నుంచి చెబుతున్నాం... నిన్ను ఓడించడానికి మేం సిద్ధం. మమ్మల్ని అడ్డుకోవాలంటే నీ వల్ల కాదు... సైకిల్ స్పీడు పెంచి తొక్కుకుంటూ ముందుకెళతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరింత పదునెక్కుతుంది... నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుందే తప్ప, నీ బురద అంటదు. ఈ మూడు కలిసిన తర్వాత ఇక అన్ స్టాపబుల్. 

పవన్ కల్యాణ్ ఇప్పటికే చెప్పారు... మూడు పార్టీలు కలిసింది మా కోసం కాదు... రాష్ట్రం కోసం. ఈ జోరు ఆగేది కాదు... మా కాంబినేషన్ సూపర్ హిట్. చాలామంది సినిమాల్లో హీరోలుగా ఉంటారు కానీ, ప్రజల్లో నిజమైన హీరో పవన్ కల్యాణ్. ఆయన కోట్ల డబ్బును, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం వచ్చారు. ఎన్ని దాడులు, వేధింపులు ఎదురైనా మడమ తిప్పని నాయకుడు. 

మేం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఈ ఆటుపోట్లు మాకు కొత్త కాదు... మేం రాటుదేలిపోయాం. కానీ పవన్ కు ఇలాంటి పరిస్థితులు అలవాటు లేకపోయినా నిలదొక్కుకున్నారు. మావి మూడు జెండాలు... కానీ అజెండా ఒక్కటే. సీట్ల సర్దుబాటుతో అనేక త్యాగాలు చేసి మీ వద్దకు వచ్చాం. నిండు మనసుతో ఆశీర్వదించండి. 

ఇక సీఎం జగన్ తాను ఒంటరినని చెబుతున్నాడు. నువ్వు సింగిల్ గా రావడంలేదు... శవాలతో వస్తున్నావు... అది మర్చిపోవద్దు. 2014లో తండ్రి లేని బిడ్డ అని వచ్చావు... 2019లో మా బాబాయిని చంపేశారని వచ్చావు... నువ్వే చంపి, మా బాబాయి కూడా లేడంటూ వచ్చావు. ఇప్పుడు పెన్షన్ల పేరిట వృద్ధులతో శవరాజకీయాలు చేస్తున్నావు.

జగన్ ను చూస్తే అందరు భయపడిపోయారు... టికెట్లు ఇస్తామన్నా సరే... ఎమ్మెల్యేలు పారిపోతున్నారు, ఎంపీలు కూడా పారిపోతున్నారు. నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు అంటూ వైసీపీని వదలి మన వద్దకు వస్తున్నారు. ఇవాళ ఇక్బాల్ అనే ఎమ్మెల్సీ కూడా పదవికి రాజీనామా చేసి టీడీపీలోకి వచ్చారు. నాలుగేళ్ల పదవీకాలం ఉంటే సి.రామచంద్రయ్య కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చేశారు. 

పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఈ రాష్ట్రంలో బాగుపడిందెవరైనా ఉంటే అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. రాష్ట్రాన్ని జగన్ నలుగురికి అప్పగించాడు... సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, పెద్దిరెడ్డి.... ఇలాంటి వాళ్లే బాగుపడ్డారు తప్ప... ప్రజలకు ఒరిగిందేమీలేదు. పవన్, నేను అన్యోన్యంగా ఉంటే జగన్ కులరాజకీయాల చిచ్చుపెట్టాడు. మేం బీజేపీతో కలిస్తే మతరాజకీయాలకు తెరలేపాడు. జగన్... ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండకపోతే నీ అడ్రస్ గల్లంతవుతుంది, ఆ చిచ్చులో నిన్నే దగ్ధం చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రాంతీయ విద్వేషాలను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులను ప్రజలే అధిగమించాలి. 

ఎన్డీయే ప్రభుత్వం వస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తామని దుష్ప్రచారం చేస్తున్నాడు. సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందే ఎన్టీ రామారావు. ఎన్డీయే వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోవు... ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు తీసుకువస్తాం. ఇప్పటికే సూపర్-6 ప్రకటించాం... మిత్రుడు పవన్ కల్యాణ్ చెప్పినట్టుగా 10 పాయింట్స్ ఫార్ములా కూడా ప్రకటిస్తాం... " అని చంద్రబాబు వెల్లడించారు.


More Telugu News