న్యాయవాదులను కలిసే విషయంపై.. కేజ్రీవాల్‌ పిటిషన్ ను తిరస్కరించిన కోర్టు

  • న్యాయవాదులను కలిసేందుకు వారానికి ఐదుసార్లు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్
  • ఇప్పటికే రెండుసార్లు ఇస్తే లిటిగేషన్ వ్యూహాలకు బదులు... ఇతర అంశాల కోసం వినియోగిస్తున్నారన్న కోర్టు
  • అందుకే పిటిషన్ కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసిన న్యాయస్థానం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టులో బుధవారం చుక్కెదురైంది. వారానికి ఐదుసార్లు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ఇదివరకు వారానికి రెండుసార్లు న్యాయవాదులను కలిసేందుకు కేజ్రీవాల్‌కు కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఐదుసార్లు అనుమతి కావాలని కేజ్రీవాల్ కోరిన పిటిషన్‌ను రౌస్ అవెన్యూ స్పెషల్ జడ్జి తోసిపుచ్చారు.

కేజ్రీవాల్‌కు వారానికి రెండుసార్లు కలిసేందుకు అవకాశమిస్తే దానిని న్యాయవాదులతో లిటిగేషన్ వ్యూహాలను చర్చించేందుకు ఉపయోగించకుండా, జలమంత్రికి ఆదేశాలు ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. 'వ్యాజ్యాలను చర్చించడం కోసం వారానికి రెండుసార్లు అనుమతి ఇస్తే... ఈ సమయంలో వాటిపైనే న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు చెప్పడంలో కేజ్రీవాల్ విఫలమయ్యార'ని కోర్టు పేర్కొంది. 

రెండుసార్లు లీగల్ ఇష్యూస్‌పై చర్చించేందుకు అవకాశమిస్తే వాటిని కేజ్రీవాల్ వినియోగించుకోవడం లేదని, ఇతర ప్రయోజనాల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారని, అందుకే పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ అంశంలో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు.


More Telugu News