రేవంత్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తి... ఈటల రాజేందర్ మోసగాడు: పాడి కౌశిక్ రెడ్డి విమర్శలు

  • ఉపఎన్నికల్లో ఈటలను గెలిపించేందుకు రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నాడని ఆరోపణ
  • హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేసిన కౌశిక్ రెడ్డి
  • మల్కాజ్‌గిరి లోక్ సభ అభ్యర్థిగా కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని పెట్టిందని విమర్శ
  • ఈటల రాజేందర్ మోసగాడు... ఆయన మోసాలు చెప్పేందుకే మల్కాజ్‌గిరికి వచ్చానని వ్యాఖ్య
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈటల రాజేందర్ పెద్ద మోసగాడని... తాను సంపాదించుకున్న ఆస్తుల్ని కాపాడుకోవడానికే మల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నాడన్నారు. ఈటలను హుజూరాబాద్‌లో గెలిపించేందుకు రేవంత్ రెడ్డి ఆయన నుంచి రూ.25 కోట్లు తీసుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తి అన్నారు.

ఈట‌ల రాజేంద‌ర్ పెద్ద మోస‌గాడు.. తాను సంపాదించుకున్న అక్ర‌మ ఆస్తుల‌ను కాపాడుకునేందుకే మ‌ల్కాజ్‌గిరిలో పోటీ చేస్తున్నాడ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... గులాబీ శ్రేణులకు కేసీఆర్, కేటీఆర్ అండగా ఉంటారన్నారు. చేతులు జోడించి చెబుతున్నా... కొట్లాడుదాం... అధైర్యపడవద్దు... రేవంత్ రెడ్డితో ఏమీ కాదు... ఆయన అమ్ముడుపోయే వ్యక్తి అన్నారు.

పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఈ అయిదేళ్ల కాలంలో ఏనాడైనా ముఖం చూపించాడా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత‌కు మ‌ల్కాజ్‌గిరితో ఏం సంబంధం? అని నిలదీశారు. బీజేపీతో కుమ్మ‌క్కై డ‌మ్మీ అభ్య‌ర్థి సునీత‌ను నిల‌బెట్టారని వ్యాఖ్యానించారు. ఈట‌ల‌ను గెలిపించేందుకు రేవంత్ ప్లాన్ చేశారని ఆరోపించారు. నాడు హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలో ఏం చేశాడో... మ‌ల్కాజ్‌గిరిలో అదే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. త‌స్మాత్ జాగ్ర‌త్త‌ అన్నారు.

ఆరోజు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని... ఉపఎన్నిక‌లో అభ్య‌ర్థిగా తాను ఉండాల్సిందని... కానీ అక్కడ ఇదే ఈట‌ల‌ వద్ద రూ.25 కోట్లు తీసుకొని రేవంత్ రెడ్డి అమ్ముడు పోయాడని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉంటూ బీజేపీ అభ్య‌ర్థి గెలుస్తాడ‌ని చెప్పాడని గుర్తు చేశారు. ఇక లాభం లేద‌ని చెప్పి తాను బీఆర్ఎస్‌లో చేరానన్నారు. డ‌మ్మీ అభ్య‌ర్థి బ‌ల్మూరి వెంక‌ట్‌ను పోటీలో పెడితే 2500 ఓట్లు మాత్రమే రావడంతో ఈట‌ల గెలిచాడన్నారు.

ఈట‌ల రాజేంద‌ర్ మోసాలు చెప్పేందుకే తాను మల్కాజ్‌గిరికి వచ్చానన్నారు. మీ అంద‌రికి ఒక్క‌టే మాట చెబుతున్నా.. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో చెల్ల‌ని రూపాయి.. మ‌ల్కాజ్‌గిరిలో ఎలా చెల్లుతుంది? ఆలోచించాలన్నారు. 20 ఏళ్లు హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉండి అభివృద్ధి చేయలేదని... అక్కడి ప్ర‌జ‌ల‌ను మోసం చేశాడన్నారు. గ‌జ్వేల్ ప్ర‌జ‌ల‌ను కూడా మోసం చేశాడన్నారు. అన్నం పెట్టిన కేసీఆర్‌నూ మోసం చేశాడని విమర్శించారు. ఇవాళ మ‌ల్కాజ్‌గిరిలో మిమ్మల్ని మోసం చేయ‌డానికి వస్తున్నాడు... తస్మాత్ జాగ్రత్త అన్నారు.

ఇరవై ఏళ్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఈటల కనీసం అయిదేళ్లు అధికారం లేకుండా ఉండలేకపోతున్నారా? అని విమర్శించారు. ఆయన మల్కాజ్‌గిరిలో పోటీ చేయాల్సిన అవసరం ఏమి వచ్చిందో చెప్పాలన్నారు. అక్రమ సొమ్మును కాపాడుకోవడానికే పోటీ చేస్తున్నారన్నారు. దేవుడిని మొక్కుతా.. న‌మ్ముతా.. గుడి క‌ట్టాల‌ని చెబుతున్నారని... ఇరవై ఏళ్లలో ఏ ఒక్క‌నాడు కూడా బొట్టు పెట్టుకోలేదని ఈటలపై మండిపడ్డారు. సిగ్గులేకుండా ఇవాళ దేవుడి గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ, ఇంగ్లీష్ రాని వారు గెలిచాక పార్లమెంట్‌లో ఏం మాట్లాడుతారని ప్రశ్నించారు.


More Telugu News