ఆ భయంతోనే రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు: కేటీఆర్ వ్యాఖ్య

  • రేవంత్ రెడ్డి ప్రభుత్వం 420 హామీలు అమలు చేయకుంటే వెంటపడతాం... వేటాడుతామని హెచ్చరిక
  • రేవంత్ రెడ్డి పక్కనే ఉన్న నల్గొండ, ఖమ్మం మానవబాంబులు ఇబ్బంది పెడతారని వ్యాఖ్య
  • బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని విమర్శ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ మీద ఉన్న శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రతిపక్షాలు ఉంటే తన జేబులో ఉండాలి, లేదంటే జైల్లో ఉండాలనే నినాదంతో మోదీ ముందుకు వెళుతున్నారని... ఆ భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధి ముఖ్యనేతలతో మేడిప‌ల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... తన ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే కుట్ర జ‌రుగుతోందని రేవంత్ రెడ్డి అంటున్నారని... కానీ ఈ ప్రభుత్వం అయిదేళ్లు ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. 420 హామీలు అమ‌లు చేయాల‌న్నారు. లేదంటే ప్రభుత్వాన్ని వెంటాడుతాం.. వేటాడుతామని హెచ్చరించారు. ప్రజలందరినీ కూడ‌గ‌ట్టి కాంగ్రెస్‌నే రాజ‌కీయంగా బొంద పెడతామన్నారు.

నీ ప‌క్క‌నే నల్గొండ, ఖ‌మ్మం మాన‌వ‌బాంబులు ఉన్నాయని... వాళ్లే రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెడతారన్నారు. రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే ఖ‌ర్మ తమకు లేదని... ఆటోమేటిక్‌గా ఆయనే పెయిల్ అవుతాడని విమర్శించారు. ఇచ్చిన హామీలు నిల‌బెట్టుకునే తెలివి లేదు... రాష్ట్ర సంపదను పెంచే తెలివిలేదని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. వాట‌ర్ ట్యాపింగ్స్ మీద శ్రద్ధ పెట్టాలని సూచించారు. కేసీఆర్ ఇంటింటికి నీళ్లు ఇస్తే ఇప్పుడు వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయన్నారు.

ఉగాది ప‌చ్చ‌డి మాదిరిగా జీవితంలో ఎత్తుప‌ల్లాలు, చేదు తీపి అనుభ‌వాలు ఉంటాయన్నారు. రాజ‌కీయాల్లో కొన్నిసార్లు గెలుస్తాం... మరికొన్నిసార్లు ఓడిపోతాం... గెలిచినంత మాత్రానా పొంగిపోవ‌ద్దు... ఓడినంత మాత్రానా కుంగిపోయేది లేదన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంగా ప‌నిచేయాల‌ని ప్ర‌జ‌లు బీఆర్ఎస్‌కు తీర్పు ఇచ్చారని... ఆ బాధ్య‌త నిర్వ‌ర్తిస్తూ ఎన్నో అంశాల‌పై పోరాటం చేస్తున్నామన్నారు. కేసీఆర్ పద్నాలుగేళ్లు కష్టపడి తెలంగాణ సాధించారని, ఆ తర్వాత సీఎం అయి ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. రుణమాఫీ సహా ఏ హామీని పూర్తిగా అమలు చేయలేదన్నారు.

కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలంటే వారు పెట్టిన డ‌మ్మీ అభ్య‌ర్థిని ఓడించాలన్నారు. చేవెళ్ల‌లో ప‌నికిరాని చెత్త‌ను మ‌ల్కాజ్‌గిరికి తీసుకు వచ్చారన్నారు. బీజేపీకి లాభం చేసేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. సికింద్రాబాద్ సహా పలుచోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. క‌రీంన‌గ‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్థిని ప్రకటించలేదని గుర్తు చేశారు. బీజేపీ లేదా కాంగ్రెస్ గెలవాలి... కేసీఆర్, బీఆర్ఎస్ ఉండొద్దనేది ఆ రెండు పార్టీల పంథమన్నారు.

రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి పిచ్చోడిని చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన కోసమే పని చేస్తున్నాడని రాహుల్ అనుకుంటున్నాడని... కానీ అలా జరగడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఒక‌రు ప్ర‌శంసిస్తే.. మ‌రొక‌రేమో ఆయ‌న‌పై నిప్పులు చెరుగుతున్నార్ననారు. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల త‌ర్వాత రేవంత్ రెడ్డి 30 మంది ఎమ్మెల్యేల‌తో బీజేపీలోకి జంప్ అవుతారని పునరుద్ఘాటించారు. పదేళ్లలో మోదీ ఎనిమిది ప్ర‌భుత్వాల‌ను కూల్చారని ఆరోపించారు. మోదీ ఎవ‌ర్నీ బతకనీయడం లేదన్నారు.


More Telugu News