ముంబైని వీడి లక్నో సూపర్ జెయింట్స్‌లోకి రోహిత్ శర్మ?.. ఎల్ఎస్‌జీ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • రోహిత్‌ను దక్కించుకుంటామని వ్యాఖ్యానించిన లక్నో కోచ్ జస్టిన్ లాంగన్
  • సరదాగా అన్నప్పటికీ రోహిత్‌ను దక్కించుకోవడం ఖాయమంటున్న నెటిజన్లు
  • ముంబై ఇండియన్స్‌ని రోహిత్ వీడనున్నాడంటూ కొంతకాలంగా ఊహాగానాలు
ఏకంగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను పక్కన పెట్టి ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ముంబై ఇండియన్స్ కెప్టెన్సీని అప్పగించిన వ్యవహారం ఏదో ఒక రూపంలో ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది. రోహిత్ ముంబై ఇండియన్స్‌ను వీడనున్నాడని వారం రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇందుకు అనుబంధంగా తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. రోహిత్ ముంబైని వీడనున్నాడని, ఐపీఎల్ 2025 వేలంలో అతడిని లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేయనుందని, ఈ మేరకు ఆసక్తి చూపుతోందంటూ కథనాలు వెలువడుతున్నాయి. ఇందుకు సంబంధించి లక్నో కోచ్ జస్టిన్ లాంగర్‌ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి.

లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో రోహిత్‌ను దక్కించుకోవాలనే ఆసక్తిని కనబరుస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎవరైనా ఒక ఆటగాడిని కొనుగోలు చేయాలనుకుంటే ఎవరిని దక్కించుకుంటారంటూ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి ప్రశ్నించిగా జస్టిన్ లాంగర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘‘ నాకు ఒక ఆటగాడు కావాలా? ఎవరైతే బావుంటుందని మీరు అనుకుంటున్నారు?’’ అని లాంగర్ బదులు ప్రశ్నించారు.

దీంతో ఇంటర్వ్యూయర్ స్పందిస్తూ..  ‘‘మీరు రోహిత్ శర్మను దక్కించుకోవాలనుకుంటున్నారా?’’ అని సమాధానమిచ్చారు. దీంతో 'రోహిత్ శర్మ?..' అంటూ జస్టిన్ లాంగర్ కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సరదాగా నవ్వుతూ ముంబై నుంచి అతడిని తీసుకొస్తామని, మధ్యవర్తిగా ఉండాలంటూ ఇంటర్వ్యూయర్‌ను జస్టన్ లాంగర్ ఆటపట్టించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జస్టిన్ లాంగర్ సరదాగానే వ్యాఖ్యానించినప్పటికీ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి రోహిత్ శర్మ ఆడడం ఖాయమంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కాగా కెప్టెన్సీ మార్పు వ్యవహారం హార్దిక్ పాండ్యాను ఐపీఎల్2024లో ఇంకా వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఏ స్టేడియంలో మ్యాచ్ ఆడినా రోహిత్‌కు మద్దతుగా ప్రేక్షకులు నినాదాలు చేస్తున్న విషయం తెలిసిందే. పలుచోట్ల పాండ్యా హేళనలు ఎదుర్కోవాల్సి వస్తోంది.


More Telugu News