మంత్రి కాకాణి, ఆయన అల్లుడి కంపెనీ కోసం భూములు ధారాదత్తం చేస్తున్నారు: సోమిరెడ్డి

  • సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్న సోమిరెడ్డి
  • ఓ బినామీ కంపెనీ పేరిట భూములు లాగేసుకున్నారని ఆరోపణ
  • ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఆగ్రహం
  • కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
  • లోకాయుక్తను ఆశ్రయిస్తామని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని స్పష్టీకరణ
ఉమ్మడి నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ భూకుంభకోణం జరిగిందని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శాశ్వత భూ హక్కు పేరిట దోపిడీ జరుగుతోందని, కాకాణి అల్లుడి కంపెనీ కోసం భూములు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఓ బినామీ కంపెనీ పేరిట రైతుల నుంచి ఈ భూములను లాగేసుకున్నారని, ఇళ్ల పట్టాలను శాశ్వత పట్టాలుగా మార్చి జీవో తెచ్చారని, ఆ పట్టాలను వైసీపీ నేతలు తమ ఇళ్లలో పెట్టుకున్నారని సోమిరెడ్డి వివరించారు. సుధాకర్ అనే వ్యక్తికి కాకాణి అల్లుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకుని ఆస్తులను కాపాడాలని కోరారు. జూన్ 4 వరకు ఇళ్ల పట్టాలపై బెదిరింపులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

7 వేల ఎకరాల భూమి ఇచ్చామని చెబుతున్న మంత్రి కాకాణి... ఆ భూముల వివరాలను మండల కార్యాలయాల్లో ప్రదర్శించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. పేదలకు తక్కువ డబ్బు చెల్లించి కాకాణి అల్లుడు భూ దోపిడీకి పాల్పడుతున్నాడని, అల్లుడి కోసం రామదాసు కండ్రిగ వద్ద రూ.56 కోట్ల విలువ చేసే భూములను కాకాణి కట్టబెట్టారని ఆరోపించారు. 

40 ఏళ్ల నుంచి అధీనంలో ఉన్న భూములను కాకాణి కబ్జా చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అంటూ సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాణి భూ అక్రమాలపై లోకాయుక్తను ఆశ్రయిస్తామని, ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.


More Telugu News