రంజాన్ పండుగకు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..!

  • మాసబ్ ట్యాంక్ పరిసరాల్లో దారిమళ్లింపు
  • పురానాపూల్, కామాటిపురా ఏరియాలో రోడ్ క్లోజ్
  • ప్రత్యేక నమాజు దృష్ట్యా ట్రాఫిక్ పోలీసుల ఏర్పాట్లు
రంజాన్ పండుగ నేపథ్యంలో గురువారం హైదరాబాద్ లోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముస్లింల ప్రత్యేక నమాజు దృష్ట్యా మాసాబ్ ట్యాంక్, పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపుతో పాటు పలుచోట్ల రోడ్ క్లోజ్ చేస్తామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు చేస్తామని వివరించారు. ట్రాఫిక్ దారిమళ్లింపులకు సంబంధించి వివరాలను వెల్లడిస్తూ సీపీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. గురువారం ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు.

బహదూర్ పురా వద్ద..
కిషన్ బాగ్, పురానాపూల్‌, కామాటిపురా నుంచి ఈద్గా వైపు వచ్చే వాహనాలను బహదూర్‌పురా క్రాస్‌ రోడ్స్‌ వద్ద దారి మళ్లిస్తారు. క్రాస్ రోడ్స్ దాటి వెళ్లేందుకు అనుమతించరు. పురానాపూల్‌ నుంచి బహదూర్‌పురా వైపునకు వెళ్లే బస్సులను జియాగూడ వైపునకు మళ్లిస్తారు. ఈద్గాలో ప్రార్థనలకు వచ్చే వారు తమ వాహనాలను జూపార్క్ ఓపెన్ ప్లేస్ లో పార్క్ చేసుకోవాలని సీపీ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇక, శివరాంపల్లి, దానమ్మహట్స్‌ వైపు వచ్చే వాహనాలను మోడరన్‌ సా మిల్‌, మీరాలం ఫిల్టర్‌ బెడ్‌, సూఫీ కార్స్‌ దగ్గర పార్కింగ్ ఏర్పాటు చేశారు.

కాలాపత్తర్‌ నుంచి వచ్చే వాహనాలను మోచీ కాలనీ, బహదూర్‌పురా, శంషీర్‌గంజ్‌, నవాబ్‌ సాహెబ్‌కుంట వైపు దారిమళ్లిస్తారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు వచ్చే వాహనదారుల కోసం భయ్యా పార్కింగ్‌, ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకులో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ కింది నుంచి ఉదయం 8 నుంచి 11:30 గంటల వరకు వాహనాలను అనుమతించబోమని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.


More Telugu News