తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావుకు రిమాండ్ పొడిగింపు

  • నేటితో ముగిసిన రాధాకిషన్‌రావు రిమాండ్
  • మరో రెండు రోజులు పొడిగించిన నాంపల్లి కోర్టు
  • జైలులోని లైబ్రరీలోకి రాధాకిషన్‌రావుకు అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు రిమాండ్‌ను నాంపల్లి కోర్టు మరోమారు పొడిగించింది. ఆయన వారం రోజుల కస్టడీ నేటితో ముగియడంతో పోలీసులు ఆయనను ఈ ఉదయం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదోపవాదాల అనంతరం మరో రెండు రోజులు అంటే 12వ తేదీ వరకు రాధాకిషన్‌రావు రిమాండ్‌ను పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

విచారణ సందర్భంగా పోలీసులపై రాధాకిషన్‌రావు పలు ఆరోపణలు చేశారు. జైలు లైబ్రరీకి వెళ్లేందుకు తనను అనుమతించడం లేదని, జైలుసూపరింటెండెంట్‌ను సైతం కలవనీయడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో న్యాయమూర్తి పోలీసులను పిలిపించి ప్రశ్నించారు. అనంతరం ఆయనను లైబ్రరీలోకి అనుమతించడంతోపాటు సూపరింటెండెంట్‌ను కలిసేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో రాధాకిషన్‌రావును చంచల్‌గూడ జైలుకు తరలించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక పీపీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది.


More Telugu News