జనసేనకు మరో షాక్.. కైకలూరు పార్టీ సమన్వయకర్త రాజీనామా..!

  • 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బీవీ రావు
  • ఈసారి బీజేపీకి టికెట్ కేటాయింపు
  • కామినేని టీడీపీ వాళ్లను మాత్రమే కలుపుకుని వెళ్తున్నారని విమర్శ
జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బీవీ రావు పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జనసేన అభివృద్ధి కోసం చాలా ఏళ్లుగా పని చేశానని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పవన్ తనకు అవకాశం ఇచ్చారని... అప్పుడు తనకు 11 వేల ఓట్లు వచ్చాయని తెలిపారు. అప్పటి నుంచి తాను మరింత క్రియాశీలకంగా పని చేశానని చెప్పారు. 

పొత్తులో భాగంగా కైకలూరు టికెట్ బీజేపీకి దక్కింది. బీజేపీ అభ్యర్థిగా కామినేని శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. కామినేని శ్రీనివాస్ టీడీపీ వాళ్లను మాత్రమే కలుపుకుని పోతున్నారని... జనసేనలోని చిల్లర బ్యాచ్ ని వెనకేసుకుని తిరుగుతున్నారని... తనలాంటి వారిపై బురద చల్లుతున్నారని బీవీ రావు విమర్శించారు. కైకలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని నేలమట్టం చేయాలని కామినేని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. యాదవ కులానికి చెందిన తాను స్తోమతకు మించి ఖర్చు చేసి, పార్టీకి సేవలు చేస్తే మిగిలిందేమీ లేదని చెప్పారు. తనను పవన్ పిలుస్తారని వేచి చూశానని... కానీ, పిలవలేదని అన్నారు. చంద్రబాబు మాత్రం తనను పిలిచి మాట్లాడారని... బీజేపీ అభ్యర్థితో కలుపుకుని వెళ్లాలని సూచించారని తెలిపారు. 


More Telugu News