కోల్‌కతాపై ఎదుర్కొంది 3 బంతులే అయినా చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోనీ

  • ఐపీఎల్‌లో ఒక జట్టు ఛేజింగ్ విజయాల్లో ఎక్కువసార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాడిగా ధోనీ రికార్డు
  • చెన్నై గెలుపు సమయంలో మొత్తం 28 సార్లు క్రీజులో దిగ్గజం
  • రెండవ స్థానంలో మరో సీఎస్కే ఆటగాడు రవీంద్ర జడేజా
‘మిస్టర్ కూల్’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు. 42 ఏళ్ల లేటు వయసులోనూ మైదానంలో చురుగ్గా కదులుతూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. కాగా గత రాత్రి (సోమవారం) కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఐపీఎల్‌లో మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

138 పరుగుల లక్ష్య ఛేదనలో మరో 19 బంతుల్లో 3 పరుగులు అవసరం. ఆ సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు రావాలంటూ ఫ్యాన్స్ మైదానాన్ని మోతెక్కించారు. సరిగ్గా అప్పుడే ఒక వికెట్ కూడా పడడంతో ధోనీ క్రీజులోకి వచ్చాడు. 3 బంతులు ఎదుర్కొన్న ధోనీ ఒక పరుగు కొట్టాడు. మరో ఎండ్‌లో ఉన్న కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మిగతా రెండు పరుగులు రాబట్టడంతో కోల్‌కతాపై చెన్నై విజయం సాధించింది. కాగా ధోనీ ఎదుర్కొన్నది 3 బంతులే అయినా ఐపీఎల్‌లో ఒక ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించాడు. 

జట్టు విజయవంతమైన ఛేజింగ్‌లలో అత్యధికసార్లు నాటౌట్‌గా ఉన్న ఆటగాడిగా ధోనీ నిలిచాడు. కోల్‌కతాపై మ్యాచ్‌లో ఏకంగా 28వ సారి తన జట్టు గెలుపు సమయంలో క్రీజులో ఉన్నాడు. కాగా రెండవ స్థానంలో తన జట్టుకే చెందిన రవీంద్ర జడేజా ఉన్నాడు. జడేజా 27 సార్లు నాటౌట్‌గా క్రీజులో ఉన్నాడు. చెన్నైకి ఫినిషర్‌గా ఉన్న ధోనీ ఛేజింగ్‌లో చాలా సార్లు క్రీజులో ఉన్నాడు.

ఛేజింగ్‌లో ఎక్కువసార్లు నాటౌట్‌గా నిలిచిన ఆటగాళ్లు..
1. ఎంఎస్ ధోనీ - 28
2. రవీంద్ర జడేజా - 27
3. దినేశ్ కార్తీక్ - 23
4. యూసుఫ్ పఠాన్ - 22
5. డేవిడ్ మిల్లర్ - 22

కాగా తొలుత బ్యాటింగ్ చేసి కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై సునాయాసంగా ఛేదించింది. మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగానే కొనసాగినప్పటికీ బ్యాటింగ్ చేసేందుకు ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగుపెట్టినప్పుడు అభిమానుల అరుపులు, కేకలతో స్టేడియం హోరెత్తిపోయిన విషయం తెలిసిందే.


More Telugu News