రాజీవ్ రతన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

  • గుండెపోటులో మృతి చెందిన సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్
  • రాజీవ్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న రేవంత్
  • నిజాయతీగా పని చేసిన అధికారులను సమాజం మర్చిపోదని వ్యాఖ్య
సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పోలీసు శాఖలో ఆయన సుదీర్ఘకాలం పాటు సేవలందించారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. రాజీవ్ రతన్ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా రేవంత్ స్పందిస్తూ... రాజీవ్ రతన్ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో పోలీసు విభాగానికి ఆయన విశిష్టమైన సేవలను అందించారని చెప్పారు. నిజాయతీగా విధులను నిర్వహించిన అధికారులను తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

రాజీవ్ రతన్ ప్రస్తుతం తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టర్ జనరల్ గా పని చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ విచారణకు ఆయనే సారథ్యం వహించారు. గతంలో ఆయన కరీంనగర్ ఎస్పీగా, పైర్ సర్వీసెస్ డీజీగా, హైదరాబాద్ రీజియన్ ఐజీగా, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా వివిధ హోదాల్లో పని చేశారు.


More Telugu News