మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి సమావేశానికి హాజరైన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

  • 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశాల జారీ
  • ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ వీరంతా బీఆర్ఎస్ అభ్యర్థి సమావేశంలో పాల్గొన్నట్లు వెల్లడి
  • సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు
మెదక్ లోక్ సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులపై వేటు పడింది. మొత్తం 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనుచౌదరి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ వీరంతా బీఆర్ఎస్ అభ్యర్థి సమావేశంలో పాల్గొన్నారు.

రెండు రోజుల క్రితం సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో ఉపాధి హామీ, సెర్ఫ్ ఉద్యోగులతో వెంకట్రామిరెడ్డి సమావేశమయ్యారు. దీనిపై మెదక్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులను గుర్తించారు. సస్పెండైన వారిలో 38 మంది సెర్ప్ ఉద్యోగులు, 68 మంది ఉపాధి హామీ ఉద్యోగులు ఉన్నారు.

మెదక్ లోక్ సభ సీటును గెలుచుకోవడానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాను గతంలో సిద్దిపేట కలెక్టర్‌గా పని చేసిన అనుభవం, పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నాడనే విమర్శలు వచ్చాయి. ఇందులో భాగంగానే ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, పలువురు ఉద్యోగులతో సమావేశం నిర్వహించాడు.

ఈ సమావేశం అత్యంత రహస్యంగా నిర్వహించినప్పటికీ రాత్రి పదకొండున్నర గంటలకు విషయం లీకైంది. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఫంక్షన్ హాలు వద్దకు చేరుకున్నారు. అక్కడి సిబ్బంది వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చేలోగా వెంకట్రామిరెడ్డి, ఉద్యోగులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి చర్యలు తీసుకున్నారు.


More Telugu News