ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు.. ర‌వీంద్ర జ‌డేజా అరుదైన ఘ‌న‌త‌!

  • నిన్న‌టి మ్యాచులో 2 క్యాచులు, 3 వికెట్లు తీసి, 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు గెలిచిన జ‌డేజా
  • ఈ రెండు క్యాచుల‌తో 100 క్యాచుల మైలురాయి అందుకున్న జ‌డ్డూ 
  • తద్వారా ఐపీఎల్ చ‌రిత్ర‌లో 1000 ప‌రుగులు, 100 క్యాచులు, 100 వికెట్లు తీసిన తొలి ఆట‌గాడిగా రికార్డు
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సోమ‌వారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) ను చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్‌కే) 7 వికెట్ల తేడాతో మ‌ట్టిక‌రిపించిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో మూడు కీల‌క వికెట్లు తీయ‌డంతో పాటు 2 అద్భుత‌మైన క్యాచులు ప‌ట్టిన ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజాకు 'ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ద‌క్కింది. 

ఇక ఈ మ్యాచ్ ద్వారా జ‌డ్డూ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) చ‌రిత్ర‌లోనే అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. 1000 ప‌రుగులు, 100 క్యాచులు, 100 వికెట్లు తీసిన తొలి ఆట‌గాడిగా రికార్డుకెక్కాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ హిస్ట‌రీలో ఇలాంటి ఫీట్‌ను ఎవ‌రూ అందుకోలేదు. 

కాగా, మ్యాచులో ప‌వ‌ర్ ప్లే ఓవ‌ర్ల (మొద‌టి ఆరు ఓవ‌ర్లు) వ‌ర‌కు కేకేఆర్ బాగానే ఆడింది. కానీ, 7వ ఓవ‌ర్లో బౌలింగ్‌కు దిగిన జ‌డేజా ఆ జ‌ట్టు ప‌త‌నాన్ని ప్రారంభించాడు. జడేజా వేసిన 7వ ఓవర్ తొలి బంతికి యువ ఆట‌గాడు అంగ్క్రిష్ రఘువంశీ నిర్లక్ష్యపు షాట్ కార‌ణంగా ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. అలాగే ప్రమాదకరంగా కనిపిస్తున్న సునీల్ నరైన్‌ను ఇదే ఓవర్ ఐదో డెలివరీకి పెవిలియ‌న్‌కు పంపించాడు. 
 
ఇక వెంకటేష్ అయ్యర్ రూపంలో ర‌వీంద్ర‌ జడేజాకు మూడో వికెట్ ద‌క్కింది. ఇలా ఈ ఆల్ రౌండర్ తన నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అలాగే అతను ఫిల్ సాల్ట్, శ్రేయాస్ అయ్యర్‌ల క్యాచ్‌ను పట్టుకుని లీగ్ చరిత్రలో 100 క్యాచ్‌లను పూర్తి చేశాడు. 

కాగా, ఈ మైలురాయిని చేరుకున్న ఐదో ఆటగాడు జడేజా. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, ఆ త‌ర్వాతి స్థానాల్లో వరుస‌గా సురేశ్ రైనా, కీర‌న్ పొలార్డ్, రోహిత్ శ‌ర్మ‌ ఉన్నారు. ఇక ఈ 100వ క్యాచ్‌తో ఐపీఎల్ చరిత్రలో 1000 పరుగులు, 100 క్యాచ్‌లు, 100 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. జ‌డ్డూకు ఈ రికార్డు గురించి కామెంటేటర్‌ హర్ష భోగ్లే తెలియజేయ‌డం జ‌రిగింది.


More Telugu News