ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను చాలా లైట్ గా తీసుకున్న కాంగ్రెస్

  • ఈ ఎన్నికల్లో ఓడిపోతే బాధ్యతల నుంచి రాహుల్ బ్రేక్ తీసుకోవాలన్న పీకే
  • మరో నేతకు ఐదేళ్ల పాటు అవకాశం ఇవ్వాలని సూచన
  • కన్సల్టెంట్ల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్న కాంగ్రెస్
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుకోవాలని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సూచించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ తప్పుకుని మరో నేతకు అవకాశం కల్పించాలని అన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు... పీవీ నరసింహారావుకు సోనియాగాంధీ బాధ్యతలను అప్పగించారని... అదే విధంగా రాహుల్ వ్యవహరించాలని చెప్పారు. 

గత పదేళ్లలో ఎలాంటి సక్సెస్ సాధించలేనప్పుడు ఒక బ్రేక్ తీసుకోవడంలో తప్పులేదని పీకే అన్నారు. బాధ్యతల నుంచి తప్పుకుని మరొకరికి ఐదేళ్ల పాటు అవకాశం ఇవ్వాలని చెప్పారు. మీ అమ్మ సోనియా చేసిన విధంగానే మీరు కూడా చేయాలని అన్నారు. సక్సెస్ లేకపోయినా పెత్తనం చెలాయిస్తుండటం ప్రజాస్వామ్య విరుద్ధమని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ చాలా లైట్ గా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రినాటే మాట్లాడుతూ... కన్సల్టెంటులు చేసే వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయ నాయకులపై మాట్లాడితే బాగుంటుందని... కన్సల్టెంటుల గురించి ఏం మాట్లాడతామని ప్రశ్నించారు. 

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ తన కెరీర్ ను దాదాపు ముగించారు. చివరిసారిగా 2021లో ఆయన మమతా బెనర్జీ కోసం పని చేశారు. ఆ ఎన్నికల్లో మమతకు ఘన విజయాన్ని చేకూర్చారు.


More Telugu News