ప్రజా మేనిఫెస్టో తయారీకి సాయం చేయండి.. ప్రజలను కోరిన టీడీపీ కూటమి

  • వాట్సాప్ నంబర్ షేర్ చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి
  • ఇందుకోసం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు
  • మేధావులు, చదువుకున్న వారు తమ సలహాలు, ఆలోచనలు పంచుకోవాలన్న వర్ల రామయ్య
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ‘ప్రజా మేనిఫెస్టో’ రూపకల్పనకు ఎన్డీయే కూటమి ప్రజల అభిప్రాయం కోరుతోంది. ఈ ఎన్నికల్లో ఒక్కటిగా బరిలోకి దిగుతున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇందుకోసం వాట్సాప్ నంబర్‌ (83411 30393)ను ప్రజలకు అందుబాటులో ఉంచింది. ప్రజా మేనిఫెస్టో రూపకల్పనకు అవసరమైన సలహాలు, సూచనలను ఈ నంబరు ద్వారా అందించాలని కోరింది. 

ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మ్యానిఫెస్టో కోసం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించమని పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తమను ఆదేశించినట్టు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలు, ఆలోచనలను ఈ కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు. 

మేనిఫెస్టో రూపకల్పనలో గతంలో దేశంలోనే ఎక్కడా ఇలా ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్న దాఖలాలు లేవని తెలిపారు. ప్రజల అభిప్రాయాలతో మేనిఫెస్టో రూపొందించడం వల్ల వారి ఆశలు నెరవేరుతాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై లోతైన అవగాహన కలిగిన మేధావులు, చదువుకున్న వారు తమ అభిప్రాయాలను పంచుకోవాలని కోరారు. జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు, బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్‌‌సభ స్థానాల్లో పోటీచేస్తుండగా, బీజేపీ ఆరు లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు, జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్‌సభ సీట్లలో పోటీచేస్తున్నాయి. 


More Telugu News