అందరి సూచనల మేరకు టీడీపీలోనే ఉండాలని నిర్ణయించాం: మహాసేన రాజేశ్ 

  • తొలుత పి.గన్నవరం టికెట్ ను మహాసేన రాజేశ్ కు కేటాయించిన టీడీపీ
  • పి.గన్నవరంలో రాజేశ్ కు వ్యతిరేక పవనాలు
  • అనంతరం పి.గన్నవరం సీటును జనసేనకు కేటాయించిన కూటమి
  • టీడీపీని వదిలి బయటికి వచ్చేందుకు సిద్ధమని మహాసేన రాజేశ్ ప్రకటన
ఇటీవల కాలంలో ఏపీ రాజకీయాల్లో తరచుగా వినిపిస్తున్న పేరు మహాసేన రాజేశ్. టీడీపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో మహాసేన రాజేశ్ పేరును కూడా ప్రకటించింది. పి.గన్నవరం అసెంబ్లీ స్థానం నుంచి రాజేశ్ పోటీ చేస్తారని పేర్కొంది. 

అయితే, పి.గన్నవరం నియోజకవర్గంలో మహాసేన రాజేశ్ కు ఎదురుగాలి వీచింది. అతడికి సహకరించబోమని కూటమి పార్టీల నేతలు స్పష్టం చేసినట్టు తెలిసింది. దాంతో, మహాసేన రాజేశ్ బరిలో ఉన్నాడా, లేడా అన్నంతగా సైలెంట్ అయిపోయారు. 

ఆ తర్వాత పి.గన్నవరం సీటు జనసేన ఖాతాలో చేరింది. ఇక్కడ్నించి గిడ్డి సత్యనారాయణను పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో, టీడీపీ నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధం అంటూ మహాసేన రాజేశ్ ఓ ప్రకటనతో కలకలం రేపారు. 

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది చాలా కీలకం అని, దేశంలో ప్రతి పార్టీకి ప్రతిపక్షం ఉందని, కానీ ఏపీలో బీజేపీకి ప్రత్యర్థి పార్టీ అనేది లేకపోవడం శోచనీయం అని రాజేశ్ పేర్కొన్నారు. ఏపీలో ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకి పడుతుందని, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వారికి ఆ అవకాశం దూరం చేయకూడదని అభిప్రాయపడ్డారు. అందుకే, చంద్రబాబుకు క్షమాపణ చెప్పి టీడీపీని వీడేందుకు తాము సిద్ధమని, 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని మహాసేన రాజేశ్ ప్రకటించారు. 

అయితే, తాజాగా మహాసేన రాజేశ్ నుంచి మరో ప్రకటన వెలువడింది. తాను పార్టీ వీడేందుకు టీడీపీ పెద్దలు అంగీకరించలేదని, మహాసేన రక్షణను టీడీపీ స్వీకరిస్తుందని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చారని రాజేశ్ వెల్లడించారు. అందరి సూచనలు, సలహాల మేరకు చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలోనే ఉండాలని నిర్ణయించామని చెప్పారు. 

తనపై నమ్మకం ఉంచి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. మహాసేన అనేది ఇప్పుడు టీడీపీ ఆస్తి అని, మరో 30 ఏళ్ల పాటు పార్టీకి సేవలందించాలని చంద్రబాబు కోరారని, అందుకు మహాసేన కూడా సిద్ధమని రాజేశ్ స్పష్టం చేశారు.


More Telugu News