షార్జాలో భారీ అగ్ని ప్రమాదం.. మృతుల్లో ఇద్దరు భారతీయులు

  • 750 అపార్ట్‌మెంట్లు ఉన్న ఏడు అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలు
  • మొత్తం ఐదుగురి మృతి.. 44  మందికి గాయాలు
  • భారతీయ మృతులు, క్షతగాత్రులు సాయం అందిస్తామన్న భారత దౌత్యకార్యాలయం
గల్ఫ్ దేశం యూఏఈలోని షార్జాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. 750 అపార్ట్‌మెంట్లు ఉన్న ‘అల్ నహద’ అనే ఏడు అంతస్తుల బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. అందులో ఇద్దరు భారతీయులు కూడా ఉన్నారు. మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక మీడియా సంస్థ ‘ఖలీజ్‌టైమ్స్‌’ పేర్కొంది. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభమైంది.

మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సాయం చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు భారత దౌత్యకార్యాలయం వెల్లడించింది. బాధితుల బంధువులు ప్రమాద ప్రాంతానికి చేరుకున్నారని వివరించింది.

భారతీయ మృతుల్లో మైఖెల్ సత్యదాస్‌ అనే సౌండ్‌ ఇంజినీర్‌‌తో పాటు ఓ మహిళ కూడా ఉన్నారు. సత్యదాస్‌ మృతిని అతడు పనిచేస్తున్న డీబీఎస్‌ సంస్థ కూడా నిర్ధారించింది. ఎంతో నమ్మకమైన ఉద్యోగిని కోల్పోయామని వ్యాఖ్యానించింది. అతడి కుటుంబ సభ్యులకు అవసరమైన సాయం అందించేందుకు సిద్ధమని వెల్లడించింది. సత్యదాస్.. దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లోని డీబీఎక్స్‌లో పని చేస్తున్నాడని, ఏఆర్‌ రెహ్మాన్‌, బ్రోనోమార్స్‌ కాన్సర్టుల్లో ఇతను ముఖ్యమైన వ్యక్తి అని ఖలీజ్ టైమ్స్ కథనం పేర్కొంది.

మరోవైపు అగ్ని ప్రమాదంలో చనిపోయిన 29 ఏళ్ల మహిళ నవ వధువు అని ఖలీజ్ టైమ్స్ కథనం పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే మదీనాలో పెళ్లి జరిగిందని, ఆమె భర్తతో కలిసి షార్జాలో ఉంటోందని వివరించింది. కాగా ఇదే ప్రమాదంలో ఆమె భర్తకు తీవ్రమైన గాయాలయ్యాయని, అతడు చికిత్స పొందుతున్నాడని పేర్కొంది. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు మృతురాలి అంత్యక్రియలను షార్జాలోనే నిర్వహించే అవకాశాలున్నాయి.


More Telugu News