సీఐడీ వివరణ హాస్యాస్పదంగా ఉంది... హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయా?: పట్టాభి

  • తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనం
  • వివరణ ఇచ్చిన సీఐడీ
  • ప్రింటర్ లో ఇరుక్కుపోయిన పేపర్లను కాల్చివేశామన్న సీఐడీ
  • సీఐడీ ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తోందన్న పట్టాభి
తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద పత్రాల దహనంపై సీఐడీ ఇచ్చిన వివరణ పట్ల టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పందించారు. పత్రాల దహనంపై సీఐడీ ఇచ్చిన వివరణ హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐడీ వంద తప్పులు చేస్తోందని విమర్శించారు. 

జిరాక్స్ మిషన్ లో పేపర్లు ఇరుక్కుపోయాయని, కాగితాలు అస్పష్టంగా ప్రింట్ అయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేవలం హెరిటేజ్ కాగితాలే ఇరుక్కుపోయాయా? కేవలం హెరిటేజ్ కాగితాలకే ఇంకు ఫేడ్ అయిందా? అని పట్టాభి నిలదీశారు. సీఐడీ వివరణతో అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు. 

కాల్చేయాలనుకున్న కాగితాలను కట్టలు కట్టి మరీ కాల్చేస్తారా? ప్రింట్లు స్పష్టంగా కనిపిస్తుంటే ఫేడ్ అయ్యాయని ఎలా అంటారు? అని పట్టాభి నిలదీశారు. టీడీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసుల ఆధారాలను కూడా కాల్చేస్తున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు.


More Telugu News