విలువలు లేని రాజకీయాలు వచ్చేశాయ్.. చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను: జగన్

  • రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దన్న జగన్
  • చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్టేనని వ్యాఖ్య
  • 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అవ్వాతాతల కోసం ఏం చేశారని ప్రశ్న
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేసేందుకు ఎంతకైనా తెగిస్తారని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేనని అన్నారు. రూ. 3 వేలు పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం దేశంలో మనదేనని చెప్పారు. నెలకు రూ. 2 వేల కోట్లు పెన్షన్లకే ఇస్తున్నామని తెలిపారు. ఓట్ల కోసం ఎంతైనా ఇస్తానని చంద్రబాబు అంటారని... రంగురంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మొద్దని చెప్పారు. ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లిలో ప్రజలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమలో జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటున్న బాబు మాటలను నమ్మొద్దని జగన్ అన్నారు. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయని... విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాలు వచ్చాయని అన్నారు. ఇలాంటి రాజకీయాలను మార్చేందుకే తాను వచ్చానని చెప్పారు. చంద్రబాబుకు అవ్వాతాతలపై ప్రేమ లేదని జగన్ అన్నారు. అవ్వాతాతలను పట్టించుకోవాలంటే వారిపై ప్రేమ ఉండాలని చెప్పారు. గత ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని... ఇప్పుడు మన ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నామని... ఈ విషయాన్ని అందరూ గమనించాలని అన్నారు. 

పెన్షన్ కోసం అవ్వాతాతలు బాధలు పడకూడదనేది తన కోరిక అని జగన్ చెప్పారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు అవ్వాతాతల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చంద్రబాబు బుట్టలో పడేశారని విమర్శించారు. చంద్రబాబులా అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం తనకు రాదని అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్టేనని చెప్పారు.


More Telugu News