చందాలు వేసుకొని మరీ విరాళం ఇచ్చిన మహిళలు.. బెంగాల్ లో కాంగ్రెస్ నేత ప్రచారంలో ఘటన

  • 11 మంది మహిళలు కలిసి  11 వేలు అందించారు
  • బెర్హాంపూర్ నియోజకవర్గంలో అధిర్ రంజన్ పై ఓటర్ల అభిమానం
  • కూలీనాలి చేసి సంపాదించిన సొమ్ము అందజేసిన వైనం
ఎన్నికల ప్రచారంలో తిరిగే వాళ్లకు అభ్యర్థులు డబ్బులు ఇస్తారనే విషయం తెలిసిందే.. బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, ప్రచారం పూర్తయ్యాక ఐదొందలో వెయ్యో చేతిలో పెడతారు. కానీ ప్రచారానికి వచ్చిన ఓ అభ్యర్థికే జనం విరాళం ఇచ్చారు. బాగా డబ్బున్న వాళ్లు ఇచ్చారా అంటే అదీ కాదు.. రోజు కూలీలు, చిన్నాచితకా పని చేసుకునే పదకొండు మంది మహిళలే. కూలి పనులు చేస్తే వచ్చిన సొమ్ము, రూపాయి రూపాయి కూడబెట్టుకున్న డబ్బు రూ.11 వేలను అందించారు. ప్రచార ఖర్చులకు అవసరమవుతాయని తమ వంతుగా ఈ సొమ్ము ఇచ్చారు. బెంగాల్ లోని ముషీరాబాద్ జిల్లా బెర్హాంపూర్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరికి ఈ నియోజకవర్గం పెట్టని కోట.. 1999 నుంచి ఆయన ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. తాజాగా  పార్టీ మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చింది. దీంతో ప్రచారం మొదలు పెట్టిన అధిర్ రంజన్.. ఆదివారం బెర్హాంపూర్ లో ఓటర్లను కలిశారు. ఈ క్రమంలోనే ఆదివారం రాణ గ్రామ్ విలేజ్ లో అధిర్ రంజన్ ప్రచారం నిర్వహించారు. వీధివీధి తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లడిగారు. ఓ వీధిలో అధిర్ రంజన్ ను సాదరంగా స్వాగతించిన మహిళలు.. రూ. 11 వేలు విరాళం అందించారు. మళ్లీ ఆయనే గెలవాలని ప్రార్థనలు చేస్తున్నట్లు చెప్పారు.


More Telugu News