సమాజ్‌వాదీ పార్టీ గోరఖ్‌పూర్ లోక్‌స‌భ‌ అభ్యర్థి కాజల్ నిషాద్‌కు అస్వ‌స్థ‌త‌

  • ఆమె రక్తపోటు, గుండె సంబంధిత‌ సమస్యలతో బాధ ప‌డుతోందన్న భ‌ర్త సంజయ్ నిషాద్
  • కాజల్ నిషాద్‌ ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని ప్రైవేట్ ఆసుపత్రికి త‌ర‌లింపు
  • ఆమెకు గుండెపోటు లక్ష‌ణాలను గుర్తించిన‌ట్లు వైద్యుల వెల్ల‌డి
  • బీజేపీ అభ్య‌ర్థి సినీ నటుడు రవి కిషన్‌పై పోటీ చేస్తున్న కాజల్ నిషాద్‌  
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, ప్రముఖ భోజ్‌పురి నటి కాజల్ నిషాద్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆదివారం అర్థరాత్రి ఆమె ఆరోగ్యం క్షీణించడంతో లక్నోలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. "ఆమె రక్తపోటు, గుండె సంబంధిత‌ సమస్యలతో బాధ ప‌డుతోంది. ఆమెను లక్నోకు తీసుకువెళుతున్నాము" అని కాజల్ భర్త సంజయ్ నిషాద్ మీడియాతో అన్నారు.

శుక్రవారం ఓ బహిరంగ కార్యక్రమంలో స్పృహతప్పి పడిపోయిన ఆమెను గోరఖ్‌పూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. అక్క‌డి వైద్యులు ఆమె డీహైడ్రేషన్‌కు గురైనట్లు గుర్తించారు. అయితే, ఆదివారం కాజల్ నిషాద్‌కు ఛాతి నొప్పి రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది.

ఆమెకు ఈసీజీ పరీక్ష నిర్వ‌హించ‌గా గుండె లయలో మార్పులు గుర్తించిన‌ట్లు కాజల్ నిషాద్‌కు చికిత్స అందిస్తున్న వైద్యుడు యాసిర్ అఫ్జల్ తెలిపారు. త‌మ నివేదికలో ఆమె లక్ష‌ణాలు గుండెపోటును సూచించాయ‌ని, అందుకే ఆమెను లక్నో ఆసుపత్రికి రిఫర్ చేశామని ఆయ‌న వెల్ల‌డించారు. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను అంబులెన్స్‌లో లక్నోకు తరలించారు.

కాజల్ నిషాద్‌ పరిస్థితిపై సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌కు సమాచారం అందించారు. ఇక గోరఖ్‌పూర్‌ సదర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న కాజల్‌ నిషాద్‌.. త‌న‌కు టిక్కెట్‌ లభించినప్పటి నుంచి ఆ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

ఆమె 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. మొద‌టిసారి గోరఖ్‌పూర్ రూర‌ల్‌ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేశారు. ప్రారంభంలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. 2017లో మళ్లీ పోటీ చేశారు. ఈసారి ఆమె సమాజ్‌వాదీ పార్టీ త‌ర‌ఫున‌ బీజేపీ ఎంపీ, సినీ నటుడు రవి కిషన్‌పై పోటీ చేస్తున్నారు.


More Telugu News