చోరీకి గురైన జేపీ నడ్డా భార్య కారు లభ్యం.. ముగ్గురు నిందితుల అరెస్టు

  • కారు చోరీకి గురైనట్టు మార్చి 19న డ్రైవర్ ఫిర్యాదు
  • సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • ఉత్తరప్రదేశ్‌కు చెందిన నిందితులు చోరీకి బాధ్యులని గుర్తింపు
  • ఆదివారం నిందితుల అరెస్టు, కారును స్వాధీనం చేసుకున్న వైనం
ఇటీవల చోరీకి గురైన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా భార్య కారును ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును దొంగిలించిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శివాంశ్ త్రిపాఠి, సలీమ్, మొహమ్మద్ రయీస్‌గా గుర్తించారు. వీరందరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.  

నడ్డా భార్యకు చెందిన ఫార్చునర్ కారు సర్వీసింగ్‌కు ఇవ్వగా చోరీకి గురైనట్టు కారు డ్రైవర్ మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిరినగర్ ప్రాంతంలో కారు అదృశ్యమైనట్టు చెప్పారు. విచారణ సందర్భంగా పలు సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు హర్యానాలోని ఫరీదాబాద్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో త్రిపాఠీ, షాహిద్‌ అనే పాత నేరస్థులు ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చన్న అనుమానం కలిగింది. చివరకు మార్చి 22న పోలీసులు పాటియాలా హౌస్ కోర్టు పరిసరాల్లో త్రిపాఠీని అదుపులోకి తీసుకున్నారు. 

ఇంటరాగేషన్ సందర్భంగా త్రిపాఠి తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. షహీద్, అతడి అల్లుడు ఫరూఖ్, షాకుల్‌తో కలిసి కారును దొంగిలించినట్టు చెప్పాడు. ఆ తరువాత వాహనాన్ని షహీద్ ఇంట్లో దాచామని వివరించాడు. చోరీ వస్తువులను కొనే సలీమ్‌కు కారును అమ్మేశామని అన్నారు. ఈ సమాచారం అధారంగా పోలీసులు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులందరూ తరచూ దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు.


More Telugu News