రాయితీ ఎత్తేసి ప్రయాణికులకు షాకిచ్చిన హైదరాబాద్ మెట్రో

  • రూ.59 హాలిడే కార్డును రద్దు చేసిన అధికారులు
  • ఉదయం, రాత్రి వేళల్లో 10 శాతం రాయితీకి మంగళం
  • ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
ఎండల్లో కూల్ కూల్ గా ప్రయాణించవచ్చని అనుకున్న ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో షాకిచ్చింది. ఇప్పటి వరకు ఇస్తున్న రాయితీకి మంగళం పాడుతూ నిర్ణయం వెలువరించింది. ఉదయం, రాత్రి వేళల్లో ఇచ్చే 10 శాతం రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మెట్రో అధికారుల నిర్ణయంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. మెట్రోలో రెగ్యులర్ గా ప్రయాణించే వారికోసం గతంలో అధికారులో రూ.59 హాలిడే కార్డును తీసుకొచ్చారు. ఇది కొనుగోలు చేసిన వారికి ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు, రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు చేసే ప్రయాణాల్లో టికెట్ పై 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంది.

అయితే, రాష్ట్రంలో ఎండలు పెరగడంతో బస్సులు, సొంత వాహనాల్లో వెళ్లేందుకు చాలామంది వెనకాడుతున్నారు. సిటీ వాసులు ప్రస్తుతం మెట్రో ప్రయాణానికే మొగ్గు చూపుతున్నారు. దీంతో మెట్రో రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ రద్దీని క్యాష్ చేసుకోవడానికే మెట్రో అధికారులు హాలిడే కార్డును రద్దు చేశారని ప్రయాణికులు మండిపడుతున్నారు. వెంటనే రాయితీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.


More Telugu News