ఎమ్మెల్సీ చుట్టూ బిగుస్తున్న ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!

  • ఫోన్ ట్యాపింగ్‌కు అవసరమైన పరికరం దిగుమతికి నిధులు సమకూర్చిన ఎమ్మెల్సీ!
  • విచారణలో వెల్లడించిన భుజంగరావు, తిరుపతన్న
  • నేడో, రేపు ఎమ్మెల్సీకి నోటీసులు
తెలంగాణలో సంచలనమైన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతూ సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన ఈ కేసు తాజాగా రాజకీయ నాయకులవైపు మళ్లింది. ఈ కేసులో త్వరలోనే ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారులు రెడీ అవుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న విచారణలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ పేరు వెల్లడించినట్టు సమాచారం. 

ఫోన్ల ట్యాపింగ్‌కు అవసరమైన ఎలక్ట్రానిక్ పరికరాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆ ఎమ్మెల్సీ నిధులు సమకూర్చినట్టు నిర్ధారించిన పోలీసులు నేడో, రేపో ఆయనకు నోటీసులు ఇవ్వబోతున్నట్టు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయనను విచారిస్తే మరికొందరి రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ (ఓఎస్డీ) రాధాకిషన్‌రావు మూడోరోజు పోలీసు కస్టడీ శనివారంతో ముగిసింది. మరో నాలుగు రోజుల కస్టడీ మిగిలి ఉంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


More Telugu News