క్రికెట్‌లో ధోనీ మాదిరిగా రాజకీయాల్లో రాహుల్ గాంధీ 'బెస్ట్ ఫినిషర్'.. రాజ్‌నాథ్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు

  • రాహుల్ ‘బెస్ట్ ఫినిషర్’ కాబట్టే కీలక నేతలు పార్టీని వీడారన్న బీజేపీ అగ్రనేత
  • కాంగ్రెస్ పార్టీ, అవినీతి మధ్య అవినాభావ సంబంధముందన్న రక్షణమంత్రి
  • మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్‌పై రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టార్గెట్‌గా కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. క్రికెట్‌లో ఎంఎస్ ధోని మాదిరిగా రాజకీయాల్లో రాహుల్ గాంధీ 'బెస్ట్ ఫినిషర్' అని అన్నారు. రాహుల్ గాంధీ బెస్ట్ ఫినిషర్ కాబట్టే పలువురు కీలక నేతలు కాంగ్రెస్‌ను వీడారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీని పూర్తిగా ఖాళీ చేసేవరకు రాహుల్ గాంధీ ఆగరని అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ కాంగ్రెస్ కీలక నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందోనని నేను కొన్నిసార్లు ఆశ్చర్యపోయాను. మొత్తానికి ఒక నిర్ణయానికి వచ్చాను. క్రికెట్‌లో బెస్ట్ ఫినిషర్ ఎవరు?... ధోనీ. మరి ఎవరైనా నన్ను భారత రాజకీయాల్లో బెస్ట్ ఫినిషర్ ఎవరని అడిగితే రాహుల్ గాంధీ అని ఠక్కున చెబుతాను. అందుకే పలువురు నేతలు కాంగ్రెస్‌ను వీడారు’’ అని రాజ్‌నాథ్ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి అవినీతితో విడదీయరాని సంబంధం ఉందని ఆరోపించారు. అవినీతి, కాంగ్రెస్ మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని ఏ మంత్రిపైనా అలాంటి ఆరోపణలు రాలేదని అన్నారు.

ఒకప్పుడు భారత రాజకీయాన్ని శాసించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రెండు, మూడు చిన్న రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' ప్రతిపాదనపై కాంగ్రెస్ వాదనను రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే సమయం, వనరులు మిగులుతాయన్నారు. జమిలి ఎన్నికల ద్వారా భారత ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో రెండుసార్లు ఎన్నికలు జరగాలన్నారు. ఒకసారి స్థానిక సంస్థలకు, మరోసారి అసెంబ్లీలు, లోక్‌సభలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొన్నారు.


More Telugu News