తొలి భారత ఒలింపిక్ జ్యూరీ సభ్యురాలిగా కశ్మీరీ క్రీడాకారిణి ఎంపిక

  • చరిత్ర సృష్టించిన కశ్మీరీ క్రీడాకారిణి బిల్కిస్ మిర్
  • కనూయింగ్, కయాకింగ్‌లో 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గడించిన బిల్కిస్
  • ఈ అరుదైన గుర్తింపు దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన వైనం
  • కశ్మీర్‌కు చెందిన మరింత మంది యువతులు వాటర్ స్పోర్ట్స్‌లోకి రావాలన్న బిల్కిస్ 
కశ్మీరీ మహిళ, వాటర్ స్పోర్ట్స్ క్రీడాకారిణి బిల్కిస్ మీర్ చరిత్ర సృష్టించారు. త్వరలో జరిగే ఒలింపిక్ క్రీడల్లో జ్యూరీ సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ మహిళగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో మొదలై 30 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ క్రీడా ప్రయాణంలో ఆమె.. కనూయింగ్, కయాకింగ్ క్రీడల్లో అనేక మైలురాళ్లు పూర్తి చేసుకున్నారు. వాటర్ క్వీన్ ఆఫ్ కశ్మీర్‌గా, ఆక్వా మహిళగా గుర్తింపు పొందారు. 

తనకీ అరుదైన అవకాశం దక్కడంపై బిల్కిస్ హర్షం వ్యక్తం చేశారు. తన కల నిజమైందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం తనకెంతో గర్వకారణమని అన్నారు. జమ్మూకశ్మీర్‌లోని జలవనరుల కారణంగా అక్కడి యువతలో వాటర్ స్పోర్ట్స్‌కు సంబంధించి విశేష ప్రతిభాపాటవాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. బిల్కిస్ జ్యూరి సభ్యురాలిగా ఎంపికైన విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ ఇటీవలే ధ్రువీకరించింది. 

బిల్కిస్ గతంలో కనూయింగ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. అంతేకాకుండా, జాతీయ మహిళా జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. చైనాలోని హాంగ్జోలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో ఒకేఒక భారత జ్యూరీ సభ్యురాలిగా ఆమె పాల్గొన్నారు. 

క్రీడాప్రపంచంలో అనేక శిఖరాలు అధిరోహించిన బిల్కిస్..యువక్రీడాకారులను ప్రోత్సహించడంలోనూ ముందున్నారు. కశ్మీర్‌కు చెందిన అనేక మంది యువతులు వాటర్ స్పోర్ట్స్‌లో తమ సత్తా చాటాలని ఆమె ఆకాంక్షించారు. తన ప్రతిభకు గుర్తింపుగా ఆమె రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు కూడా అందుకున్నారు.


More Telugu News