​ఉండి సీటుపై చంద్రబాబు నాకేమీ చెప్పలేదు... నేనేమీ అడగలేదు: రఘురామకృష్ణరాజు

  • నిన్న టీడీపీలో చేరిన రఘురామకృష్ణరాజు
  • రఘురామకు ఉండి టికెట్ ఇచ్చారంటూ నేడు వార్తలు
  • ఉండి టికెట్ పై వార్తలు అవాస్తవం అంటూ రఘురామ ఖండన
  • టీడీపీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరిస్తానని వెల్లడి 
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న పాలకొల్లు ప్రజాగళం సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజు సేవలు ఎలా ఉపయోగించుకోవాలన్నది పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అయితే, ఇవాళ రఘురామకు ఉండి అసెంబ్లీ టికెట్ కేటాయించారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై రఘురామకృష్ణరాజు స్పందించారు. 

ఉండి టికెట్ నీకే అని చంద్రబాబు నాకు చెప్పలేదు, అదే సమయంలో ఉండి టికెట్ నీకు ఇవ్వడంలేదు అని సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కూడా చెప్పలేదు అని వివరణ ఇచ్చారు. తనకు తెలిసినంత వరకు ఇదే వాస్తవం అని రఘురామ స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ సీట్ నాదే... మీరు ఇక్కడ అనవసరంగా గొడవ చేస్తున్నారు అంటూ రామరాజు తాను తీసుకొచ్చిన వాళ్లను తానే ఓదార్చారు అని వెల్లడించారు. 

తాను ఎలాంటి షరతులు విధించి తెలుగుదేశం పార్టీలోకి రాలేదని అన్నారు. కచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తాననే అనుకుంటున్నానని, తాను పోటీలో లేకపోతే ఆ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తారని భావించడంలేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రజాభిప్రాయం ప్రకారమే ముందుకు వెళ్లాలని, తాను చేయించిన సర్వేలు కూడా అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. 

తాను ఎన్నికల్లో పోటీ చేయడంపై అనుమానాలు లేవని, అది ఎంపీగానా, ఎమ్మెల్యేగానా అనేది చంద్రబాబు డిసైడ్ చేయాలి, లేకపోతే ఈ లోపు కాలక్షేపంగా మీరైనా డిసైడ్ చేయాలి అంటూ నవ్వుతూనే మీడియా ప్రతినిధులకు చురక అంటించారు. 

తనకు నరసాపురం పార్లమెంటు ఇన్చార్జి బాధ్యతలేమీ ఇవ్వలేదని రఘురామ స్పష్టం చేశారు. అయినా, నేను అక్కడ సిట్టింగ్ ఎంపీనయ్యా... నన్ను అక్కడ్నించి పీకే వాళ్లే లేరు... జూన్ 4 దాకా నేనే ఎంపీని అని వ్యాఖ్యానించారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అనుసరించడం తన విధి అని పేర్కొన్నారు. ఫలానా చోట నుంచి పోటీ చేస్తానని చంద్రబాబును తానేమీ అడగలేదని, అయితే విజయనగరం నుంచి తనకు ఆహ్వానాలు అందాయని రఘురామకృష్ణరాజు వెల్లడించారు.


More Telugu News