కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు వేలాదిమంది ఫోన్లు ట్యాప్ చేయించారు: తుక్కుగూడలో రాహుల్ గాంధీ ఆరోపణ

  • కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నడిపారో... ఢిల్లీలో మోదీ అలాగే పాలిస్తున్నారన్న రాహుల్ గాంధీ
  • ఢిల్లీలో మీ కోసం సైనికుడిలా నిలబడతానని హామీ
  • కేంద్రంలో బీజేపీ వాషింగ్ మిషన్‌ను నడిపిస్తోందని ఎద్దేవా 
  • ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం ఎలక్టోరల్ బాండ్స్ అని విమర్శ
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా నడిపారో అందరికీ తెలుసునని... ఫోన్ ట్యాపింగ్ చేశారని... ఇక్కడ కేసీఆర్ ఎలా పాలన చేశారో... ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో అలాగే పాలిస్తున్నారని ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

తుక్కుగూడ 'జన జాతర' సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ... కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వేలాదిమంది ఫోన్లను ట్యాప్ చేయించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి... ప్రభుత్వం మారగానే డేటాను ధ్వంసం చేశారని మండిపడ్డారు. 

తెలంగాణ ప్రజల కలనను కేసీఆర్ కల్లలు చేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తెలంగాణలో మీ ప్రభుత్వం పని మొదలు పెట్టిందని... సోనియా గాంధీ మీ వెంట ఉంటారన్నారు. ఢిల్లీలో మీ కోసం సైనికుడిలా నిలబడతానని హామీ ఇచ్చారు.

కేంద్రంలో బీజేపీ వాషింగ్ మిషన్‌ను నడిపిస్తోందని ఎద్దేవా చేశారు. మోదీ కేబినెట్లో అవినీతి మంత్రులు ఉన్నారన్నారు. వారి పార్టీలో చేరగానే అవినీతి మాయమవుతుందని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్‌లో కూడా మోదీ మనుషులు ఉన్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం ఎలక్టోరల్ బాండ్స్ అని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ 'బీ టీం'ను ఓడించామని... ఇక దేశంలో 'ఏ టీం'ను ఓడించబోతున్నామన్నారు.

బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెబుతోందని... కానీ అందుకు తాము అవకాశం ఇవ్వబోమన్నారు. మోదీ మూడు నాలుగు శాతం ఉన్న ప్రజల కోసమే పని చేస్తున్నారని ఆరోపించారు. ఆయన వద్ద మీడియా, ఈడీ, సీబీఐ వంటివి ఉన్నాయని... కాంగ్రెస్ వద్ద మాత్రం ప్రజల ప్రేమ, న్యాయం ఉన్నాయన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. దేశ ప్రజల ముందు తాము ఐదు హామీలు ఉంచామని... కానీ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రమే కాదని... దేశ ప్రజల హృదయం విని తయారు చేసిన మేనిఫెస్టో అన్నారు. 

దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేయడానికి కులగణన చేపడతామన్నారు. అప్పుడు ఎవరి భాగస్వామ్యం ఎంతో తెలుస్తుందన్నారు. ఆర్థిక, సంస్థాగత సర్వేలూ చేపడతామన్నారు. ఈ సర్వేల ద్వారా దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలిపోతుందన్నారు.


More Telugu News