చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేకపోతున్నా: సునీత

  • వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నానన్న సునీత
  • అన్నీ ఉన్నా నిస్సహాయంగా మిగిలిపోయానని ఆవేదన
  • అవినాశ్ రెడ్డి మళ్లీ గెలవకూడదని వ్యాఖ్యలు
  • నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టీకరణ
గత ఎన్నికల సమయంలో దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత నేడు మీడియాతో మాట్లాడారు. తన తండ్రి హత్య కేసులో ఐదేళ్లుగా పోరాడుతున్నానని వెల్లడించారు. చదువు, తెలివి, స్థోమత ఉన్నా ఏమీ చేయలేక నిస్సహాయంగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ పోరాటం తన కోసమే కాదని, సామాన్యుల కోసం కూడా అని సునీత స్పష్టం చేశారు. అవినాశ్ రెడ్డి అధికారంలోకి రాకూడదనేది తన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆపై ప్రజలే నిర్ణయిస్తారని అభిప్రాయపడ్డారు. 

"2009కి ముందు కడప ఎంపీగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకాలలో ఒకరు పోటీ చేసేవారు. వైఎస్ చనిపోయాక జగన్ ఎంపీగా ఉన్నారు. వైఎస్ మరణానంతరం పులివెందులలో పోటీపై చర్చ జరిగింది. పులివెందులలో పోటీకి భాస్కర్ రెడ్డి పేరు పరిశీలనకు వచ్చింది. అయితే, పులివెందులలో భాస్కర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని వివేకా వ్యతిరేకించారు. 

ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వివేకాకు మంత్రి పదవి ఇచ్చింది... దీన్ని జగన్ వ్యతిరేకించారు. జగన్ కు తోడుగా ఉండాలన్న ఉద్దేశంతో వివేకా కాంగ్రెస్ ను వీడి వచ్చారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిలే పార్టీని నడిపించింది. ఉప ఎన్నికల సమయంలోనూ షర్మిల పార్టీని గెలిపించడంలో కృషి చేసింది. అయితే, షర్మిలకు ఆదరణ పెరుగుతోందని జగన్ ఆమెను పక్కనబెట్టారు. 

2014లో షర్మిల కడప నుంచి పోటీ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఆ ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ ను అవినాశ్ రెడ్డికి ఇచ్చారు. అవినాశ్ కు కడప ఎంపీ టికెట్ ఇవ్వడం వివేకాకు ఎంతమాత్రం ఇష్టం లేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓడిపోయారు. అవినాశ్ వెన్నుపోటు వల్లే వివేకాకు ఓటమి ఎదురైంది. 

2019లో షర్మిలకు కడప టికెట్ ఇవ్వాలనే చర్చ వచ్చింది. కడప నుంచి నువ్వే పోటీలో ఉండాలి అంటూ షర్మిలను వివేకా ఒత్తిడి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. నన్ను కూడా నరికి చంపినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. వివేకా కేసులో సీబీఐ కొంత వేగంగా పనిచేస్తోందని భావిస్తున్నాను. నా వెనుక ఎలాంటి రాజకీయ పార్టీలు లేవు. వైసీపీలో ఉన్న వారు కూడా నాకు మద్దతు పలుకుతున్నారు. 

నా కుటుంబంలో ఉన్నవారే హత్య చేశారనేదాన్ని మొదట నేను నమ్మలేదు. నా కుటుంబంలోని వాళ్లను పూర్తిగా నమ్మడమే నేను చేసిన పొరపాటు. అవినాశ్ రెడ్డి నిందితుడు అని సీబీఐ చెబుతోంది. కానీ జగన్ అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయకుండా రెండ్రోజులు అడ్డుకున్నారు. ఇటీవల కడప జైలుకు వెళ్లి దస్తగిరిని ప్రలోభపెట్టారు" అంటూ సునీత వివరించారు. 

జగన్ పై సీబీఐ, ఈడీ కేసుల్లో జాప్యం జరుగుతోందని సునీత పేర్కొన్నారు. జగన్ కేసుల్లో పదేళ్ల తర్వాత కూడా ట్రయల్ మొదలుకాలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


More Telugu News