సీబీఐ విచారణకు అనుమతించడాన్ని రౌస్ అవెన్యూ కోర్టులో సవాల్ చేసిన కవిత

  • లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చేసిన ఈడీ
  • ఇప్పుడీ కేసులో సీబీఐ విచారణకు ఢిల్లీ కోర్టు అనుమతి
  • పిటిషన్ వేసిన కవిత... కౌంటర్ దాఖలుకు సమయం కోరిన సీబీఐ
  • తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, ఈ కేసులో కవితను విచారించేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 

తనను విచారించేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వడాన్ని కవిత సవాల్ చేస్తూ, రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరిగింది. కవిత న్యాయవాది నితీశ్ రాణా కోర్టు ఎదుటకు పిటిషన్ లోని అంశాలను మెన్షన్ చేశారు. 

అయితే, కవిత పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ కోరగా, ఏప్రిల్ 10 వరకు సమయం ఇస్తామని కోర్టు తెలిపింది. సీబీఐ కౌంటర్ అఫిడవిట్ సమర్పించాక, ఏప్రిల్ 10వ తేదీన తదుపరి విచారణ చేపడతామని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి స్పష్టం చేశారు. 

కాగా, సోమవారం నాడు కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు వెలువడనుంది. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


More Telugu News