కాంగ్రెస్‌ పార్టీపై కేటీఆర్ విసుర్లు!

  • ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల్ని చేర్చుకోవ‌డం ప్రారంభించిందే కాంగ్రెస్ అంటూ కేటీఆర్ విమ‌ర్శ‌లు
  • ఇప్ప‌టికైనా త‌న విధానాన్ని మార్చుకోవ‌డం మంచిదేన‌న్న బీఆర్ఎస్ నేత‌
  • కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టిలానే చెప్పేది ఒక‌టి.. చేసేది మ‌రొక‌టి ఉంటుంద‌ని ఎద్దేవా
  • తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్య‌తిరేకంగా హ‌స్తం పార్టీ విధానాలు ఉంటాయ‌న్న కేటీఆర్‌  
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌త‌దేశంలో ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల్ని చేర్చుకోవ‌డం ప్రారంభించిందే హ‌స్తం పార్టీ అని దుయ్య‌బ‌ట్టారు. కాంగ్రెస్ ప్రారంభించిన ఆయారాం-గ‌యారాం సంస్కృతి ప‌ట్ల‌ ఇప్ప‌టికైనా త‌న విధానాన్ని మార్చుకోవ‌డం మంచిదేన‌ని చెప్పుకొచ్చారు. 

కాగా, తాజాగా కాంగ్రెస్ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం విడుద‌ల చేసిన త‌న మెనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమెటిక్‌గా స‌భ్య‌త్వం ర‌ద్దు అవుతుంద‌నే హామీ బాగుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎప్ప‌టిలానే చెప్పేది ఒక‌టి.. చేసేది మ‌రొక‌టి ఉంటుంద‌ని ఎద్దేవా చేశారు. తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్య‌తిరేకంగా హ‌స్తం పార్టీ విధానాలు ఉంటాయ‌ని బీఆర్ఎస్ నేత తెలిపారు.  

ఒక‌వైపు త‌న మెనిఫెస్టోలో ఇత‌ర పార్టీల నుంచి నేత‌ల‌ను చేర్చుకోమంటూనే.. తెలంగాణ‌లో కారు గుర్తుపై గెలిచిన గులాబీ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చింద‌ని గుర్తు చేశారు. అలాగే మ‌రో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయ‌కుండానే త‌న పార్టీలో క‌లుపుకుంద‌ని విమ‌ర్శించారు. 

రాహుల్ గాంధీకి త‌మ హామీల‌పై నిబ‌ద్ధ‌త ఉంటే ఈ అంశంపై మాట్లాడాల‌న్నారు. ఇప్ప‌టికైనా బీఆర్ ఎస్ నుంచి చేరిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాల‌ని లేనిప‌క్షంలో స్పీక‌ర్ ద్వారా అన‌ర్హ‌త వేటు వేయించాల‌న్నారు. త‌ద్వారా తాము చెప్పిందే చేస్తామ‌ని, అబ‌ద్ధాలు చెప్ప‌మ‌నే విష‌యాన్ని నిరూపించుకోవాల‌ని రాహుల్ గాంధీని కేటీఆర్ స‌వాల్ చేశారు.


More Telugu News