క్యూఆర్‌ కోడ్‌‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే శాఖ

  • పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పలు రైల్వే స్టేషన్ల బుకింగ్‌ కౌంటర్ల వద్ద ఏర్పాటు
  • విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని పలు స్టేషన్లలో అందుబాటులోకి తెచ్చిన అధికారులు
  • ప్రయాణీకులు జనరల్ టికెట్‌ను యూపీఐ పేమెంట్ల ద్వారా సులభంగా కొనుగోలు చేసే అవకాశం
ప్రయాణీకులు ఇకపై డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా పలు స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ రైల్వేస్టేషన్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని తెనాలి, ఏలూరు, రాజమహేంద్రవరం స్టేషన్లలో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. కాగా క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపుల విధానం ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సౌలభ్యాన్ని క్రమక్రమంగా డివిజన్‌ అంతటా అన్ని రైల్వేస్టేషన్లలోనూ అమలు చేస్తామని తెలిపారు. డిజిటల్ విధానంలో చెల్లింపులను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు కృషి చేసిన విజయవాడ డివిజన్ సీనియర్‌ డీసీఎం వి.రాంబాబు, కమర్షియల్‌ సిబ్బందిని నరేంద్ర ఆనందరావు అభినందించారు.

డిజిటల్ చెల్లింపుల విధానం అమల్లోకి రావడంతో ప్రయాణీకులు నగదు అవసరం లేకుండానే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేసి యూపీఐ పేమెంట్లు చేయవచ్చు. రైల్వే టికెటింగ్ ఉద్యోగి ఎంటర్ చేసిన వివరాలను బుకింగ్‌ కౌంటరు ముందు ఏర్పాటు చేసిన స్కీన్‌‌పై ప్రయాణికుడు పరిశీలించుకోవచ్చు. ఇక అదే స్క్రీన్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పేమెంట్‌ యాప్‌ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. దీంతో జనరల్‌ టికెట్‌ జారీ అవుతుంది. దీంతో రైల్వే జనరల్‌ టికెట్ల కొనుగోలు మరింత సులభతరం కానుంది. అంతేకాకుండా డిజిటల్‌, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ విధానం తోడ్పాటు ఇవ్వనుంది.


More Telugu News