చెన్నై జోరుకు కళ్లెం... సన్ రైజర్స్ ముందు ఈజీ టార్గెట్

  • ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ × చెన్నై సూపర్ కింగ్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసిన చెన్నై
  • మరోసారి తన కెప్టెన్సీ ప్రతిభను ప్రదర్శించిన కమిన్స్
ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా రాణించింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ సారథి ప్యాట్ కమిన్స్ తన కెప్టెన్సీ ప్రతిభను మరోసారి ప్రదర్శించాడు... భారీ స్కోరు దిశగా సాగిపోతున్న చెన్నై జట్టుకు కళ్లెం వేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు. 

ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసింది. శివమ్ దూబే క్రీజులో ఉన్న సమయంలో చెన్నై జట్టు ఈజీగా 200 పరుగులు చేస్తుందనిపించింది. 

అయితే, దూబేను అవుట్ చేయడం ద్వారా కమిన్స్ చెన్నై ఆశలపై నీళ్లు చల్లాడు. శివమ్ దూబే 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సులతో 45 పరుగులు చేశాడు. రహానే 35, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 26, రవీంద్ర జడేజా 31 (నాటౌట్) పరుగులు చేశారు. డారిల్ మిచెల్ 13 పరుగులకు అవుట్ కాగా, ధోనీ రెండు బంతులాడి 1 పరుగుతో నాటౌట్ గా నిలిచాడు. 

సన్ రైజర్స్ బౌలర్లలో కమిన్స్ 1, భువనేశ్వర్ కుమార్ 1, నటరాజన్ 1, షాబాజ్ అహ్మద్ 1, జయదేవ్ ఉనద్కట్ 1 వికెట్ తీశారు.

కాగా, ఈ మ్యాచ్ ను తిలకించేందుకు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా విచ్చేశారు.


More Telugu News