టిక్కెట్ ఇవ్వలేదని మీడియా ముందు కన్నీరుమున్నీరైన మాజీ ఎంపీ

  • పూర్నియా నుంచి గతంలో పలుమార్లు ఎంపీగా గెలిచిన పప్పు యాదవ్
  • ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని భావించిన పప్పు యాదవ్
  • ఇండియా కూటమి పొత్తులో భాగంగా ఆర్జేడీకి వెళ్లిన సీటు
  • స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పప్పు యాదవ్
బీహార్ మాజీ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ తనకు కాంగ్రెస్ పార్టీ లోక్ సభ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. దీంతో ఆయన పూర్నియా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీ ఆర్జేడీ అభ్యర్థికి మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బీహార్‌లో 40 లోక్ సభ స్థానాలకు గాను 26 స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. పూర్నియా స్థానం ఈ పార్టీకి కేటాయించారు. కాంగ్రెస్ 9 స్థానాల్లో, వామపక్షాలు 5 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.

స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి కొన్ని క్షణాల ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని ఉద్వేగానికి లోనయ్యారు. పూర్నియా నుంచి తాను పోటీ చేస్తానని చెప్పినప్పటికీ... తనను నిరాకరించారని వాపోయారు. టిక్కెట్ ఇవ్వడానికి... అంకితభావం, పార్టీ బలోపేతాన్ని చేయడాన్ని పరిగణలోకి తీసుకుంటే అవి తనకు ఉన్నాయి కదా అన్నారు.

అసలు తనలో ఏం లోపం ఉందని టిక్కెట్ ఇవ్వలేదో చెప్పాలన్నారు. తనను పదేపదే మాధేపుర లేదా సుపాల్‌కు వెళ్లమని ఎందుకు చెబుతున్నారు? అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీలో తన పార్టీ విలీనానికి ముందే తాను లాలూ ప్రసాద్ యాదవ్‌ను కలిశానని... పూర్నియాను వదిలేది లేదని అప్పుడే చెప్పానన్నారు. 1990లలో పూర్నియా నుంచి పప్పు యాదవ్ మూడుసార్లు గెలిచారు. తన రాజకీయ జీవితాన్ని అంతం చేయాలని ఎంతోమంది భావించారని... కానీ పూర్నియా ప్రజలు తనకు ఎప్పుడూ అండగా నిలిచారన్నారు. తాను రాహుల్ గాంధీ వెంటే ఉంటానన్నారు.


More Telugu News