కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

  • అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన కూన శ్రీశైలం గౌడ్
  • మల్కాజ్‌గిరి టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి
  • నిన్న ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ నేతలు
కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. దీపాదాస్ మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుత్బుల్లాపూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. అయితే మల్కాజ్‌గిరి లోక్ సభ నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపించారు. కానీ ఈ టిక్కెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన కూన శ్రీశైలం గౌడ్ ఈ రోజు కాంగ్రెస్‌లో చేరారు.

నిన్న కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డి, కొలను హనుమంతరెడ్డి, భూపతిరెడ్డిలు ఆయన నివాసానికి వెళ్లి, కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ఆయన మన్నించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన శ్రీశైలం గౌడ్ బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద చేతిలో ఓడిపోయారు. శ్రీశైలం గౌడ్ 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.


More Telugu News