నాకు జగన్ ను ఓడించే సత్తా ఉంది.. ఎక్కడి నుంచైనా గెలుస్తా: రఘురామకృష్ణరాజు

  • భీమవరంలో క్షత్రియులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన రఘురాజు
  • అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించానని వ్యాఖ్య
  • తప్పుడు కేసులు మోపి, వ్యక్తిగతంగా వేధించారని మండిపాటు
తనకు కచ్చితంగా టికెట్ వస్తుందని... కూటమి నుంచి పోటీ చేయడమే తన ఆశయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. జగన్ ను ఓడించే సత్తా తనకు ఉందని, జగన్ ను ఓడించే స్థాయికి తాను ఎదిగానని చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై తనకు చాలా మంది సలహాలు ఇస్తున్నారని.. ఎక్కడి నుంచి బరిలోకి దిగినా తాను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన నియోజకవర్గం నుంచి తనను దూరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. 

అన్యాయాన్ని ఎదిరించినందుకు తనపై ఎన్నో తప్పుడు కేసులు మోపి, వ్యక్తిగతంగా వేధించారని రఘురాజు అన్నారు. అధికార పార్టీలోనే ఉంటూ ప్రతిపక్ష పాత్ర పోషించానని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటానని అన్నారు. వైసీపీ పాలనలో కేవలం భీమవరంలోనే కాకుండా మొత్తం రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. భీమవరంలో క్షత్రియ ఆత్మీయ సమావేశంలో రఘురాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థి శ్రీనివాసవర్మ, జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, భీమవరం కూటమి అభ్యర్థి పులవర్తి రామాంజనేయులు, వేగేశ్న కనకరాజు, ముదునూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News