తెలంగాణలో మరొకరిని బలితీసుకున్న ఏనుగు.. గజరాజు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్

  • తెలంగాణలో ఏనుగు కనిపించడం ఇదే తొలిసారి
  •  పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తున్న రైతును తొక్కి చంపేసిన ఏనుగు
  • బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
తెలంగాణలో తొలిసారి ఓ ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు మరొకరిని బలితీసుకుంది. బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి సమీపంలో మిరపకాయలు ఏరుతున్న అల్లూరి శంకర్‌ (55)ను తొండంతో కొట్టి చంపిన ఏనుగు 24 గంటలు కూడా గడవకముందే నిన్న తెల్లవారుజామున పెంచికలపేట మండలం కొండపల్లికి చెందిన రైతు కారు పోశన్న (65)ను తొక్కి చంపేసింది. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్తున్న ఆయనపై ఏనుగు ఒక్కసారిగా దాడిచేసి చంపేసింది. వరుస ఘటనలతో జిల్లా వ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

విషయం తెలిసిన గ్రామస్థులు, కుటుంబ సభ్యులు మృతదేహం వద్ద మూడు గంటలపాటు బైఠాయించి పోశన్న కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన అదనపు కలెక్టర్ వేణు బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఐదెకరాల భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 10 లక్షల పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కాగా, బీభత్సం సృష్టిస్తున్న ఏనుగును బంధించేందుకు మహారాష్ట్ర నుంచి నిపుణులను రప్పిస్తున్నారు. అలాగే, ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. శివారు ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.


More Telugu News