జేఈఈ మెయిన్స్ పరీక్షలు.. అభ్యర్థులకు ఎన్టీఏ కీలక సూచనలు

  • పరీక్ష అనంతరం ఎగ్జామ్ సెంటర్ల వీడియో డేటాను పరిశీలిస్తామన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ
  • విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధం విధించొచ్చని వార్నింగ్
  • పరీక్ష సమయంలో వాష్‌రూంకు వెళ్లొస్తే మళ్లీ బయోమెట్రిక్ నమోదు చేయాలని సూచన
ఐఐటీ జేఈఈ పేపర్-1 పరీక్షలు గురువారం మొదలయ్యాయి. పేపర్-2 పరీక్షను ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ).. విద్యార్థులను పరీక్షల నిబంధనల విషయంలో అప్రమత్తం చేసింది. పరీక్షలు పూర్తయ్యాక ఎగ్జామ్ సెంటర్ల వీడియో డేటాను పరిశీలిస్తామని, ఎవరైనా మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్టయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారీ జరిమానాలు, భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా నిషేధం విధిస్తామని తెలిపింది.  

అభ్యర్థుల రిమోట్ బయోమెట్రిక్ మ్యాచింగ్ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుతున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. పరీక్ష సందర్భంగా టాయిలెట్ లేదా వాష్ రూంకు వెళ్లొచ్చిన విద్యార్థులు మళ్లీ తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరును నమోదు చేసుకోవాలని పేర్కొంది. అంతకుమునుపు జనవరిలో జరిగిన పరీక్షలో కొందరు అభ్యర్థులు అవకతవకలకు పాల్పడుతూ దొరికిపోయిన నేపథ్యంలో ఎన్టీఏ నిబంధనలను కఠినతరం చేసింది.


More Telugu News