ఐరాస ప్రతినిధికి గట్టిగా బదులిచ్చిన విదేశాంగ మంత్రి జైశంకర్

  • భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరగాలని ఆశిస్తున్నామంటూ వ్యాఖ్యానించిన ఐరాస ప్రతినిధి 
  • భారత్‌లో ఎన్నికల గురించి ఐరాస చెప్పాల్సిన పనిలేదన్న విదేశాంగ మంత్రి
  • ఇక్కడ ఎన్నికలను భారత ప్రజలు చూసుకుంటారని వ్యాఖ్య
భారత్‌లో ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా జరుగుతాయని ఆశిస్తున్నామంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు భారత విదేశాంగమంత్రి జై శంకర్ గట్టిగా బదులిచ్చారు. భారత్‌లో ఎన్నికల గురించి ఐరాస చెప్పాల్సిన పనిలేదని అన్నారు. భారత్‌లో ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలని ఐక్యరాజ్యసమితి తమకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. దేశ ప్రజలు ఉన్నారని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా వారు చూసుకుంటారని, ఐరాస ప్రతినిధి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. తన సహచర మంత్రి, బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్‌కు ప్రచారం కోసం జైశంకర్ గురువారం కేరళ వెళ్లారు. అక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా భారత్‌ ప్రజల రాజకీయ, పౌర హక్కులకు రక్షణ ఉంటుందని భావిస్తున్నానని ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా,  నిష్పక్షపాతంగా ఓటు వేస్తారని ఆశిస్తున్నామని మీడియా సమావేశంలో అన్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలు స్తంభింపచేయడం వంటి పరిణామాల నేపథ్యంలో భారత్‌లో రాజకీయ అశాంతి నెలకొందని డుజారిక్ అన్నారు. ఎన్నికలు నిర్వహించే ఏ దేశంలోనైనా రాజకీయ, పౌర హక్కులు సహా ప్రతి ఒక్కరి హక్కులను రక్షించాలని, భారత్ విషయంలో ఇదే ఆశిస్తున్నామని పేర్కొన్నారు.


More Telugu News