ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్... నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు

  ఐపీఎల్ మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్... నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు
  • రెండు జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ 
  • రూ.1.67 కోట్ల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్న విద్యుత్ శాఖ 
  • పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హెచ్‌సీఏ పట్టించుకోలేదని వెల్లడి
  • ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్ సాయంతో పవర్ సరఫరా
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్ చేశారు. గత కొన్ని నెలలుగా నిర్వాహకులు కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. దీంతో ఉప్పల్ స్టేడియానికి అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. 

రేపు ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ - చెన్నై మధ్య మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ప్రాక్టీస్ చేస్తుండగా పవర్ కట్ అయింది. బిల్లులు చెల్లించకపోవడంతో కీలక మ్యాచ్‌కు ముందు విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. స్టేడియం నిర్వాహకులు రూ.1.67 కోట్ల విద్యుత్ ఉపయోగించుకున్నారని, ఆ బిల్లులు చెల్లించాల్సి ఉందని విద్యుత్ శాఖ అధికారులు చెప్పారు.

పెండింగ్‌లో ఉన్న బిల్లులు క్లియర్ చేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ హెచ్‌సీఏ పట్టించుకోలేదన్నారు. తమ నోటీసులకు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు చెప్పారు. పవర్ కట్ చేయడంతో పాటు, ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు కూడా నమోదు చేశారు. బిల్లులు చెల్లించకుండానే విద్యుత్ వాడుకున్నట్లు పదిహేను రోజుల క్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ విద్యుత్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో జనరేటర్ సాయంతో పవర్ సరఫరా చేస్తున్నారు.


More Telugu News