అమేథి ప్రజలు నేను రావాలని కోరుకుంటున్నారు: ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా

  • అమేథీ ప్రజలు స్మృతి ఇరానీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్న రాబర్ట్ వాద్రా
  • గాంధీ కుటుంబం నుంచి ఓ వ్యక్తి ఇక్కడికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య
  • తాను రాజకీయాల్లోకి ప్రవేశించి అమేథి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారన్న రాబర్ట్ వాద్రా    
కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ భర్త రాబర్ట్ వాద్రా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమేథీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఆయన ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.

గురువారం ఆయన మాట్లాడుతూ... అమేథీ ప్రజలు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని పేర్కొన్నారు. అందుకే గాంధీ కుటుంబం నుంచి ఓ వ్యక్తి ఇక్కడికి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాయ్‌బరేలి, అమేథికి ప్రాతినిథ్యం వహించేవారు ప్రజల పురోగతి, వారి సంక్షేమం కోసం పని చేయాలన్నారు. వివక్ష రాజకీయాలు సరికాదని వ్యాఖ్యానించారు. అమేథీ ప్రజలు తమ ప్రస్తుత ఎంపీ (స్మృతి ఇరానీ) పట్ల అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

స్మృతి ఇరానీ అమెథీని పట్టించుకోవడం లేదని, నియోజకవర్గానికి కూడా రావడం లేదని... అందుకే తాము గత ఎన్నికల్లో ఆమెను గెలిపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఆమె ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. గాంధీ కుటుంబంపై ఆరోపణలు చేయడం, అధికార దుర్వినియోగం మాత్రమే ఆమెకు తెలుసునన్నారు. 

అమేథీ, రాయ్‌బరేలీ, సుల్తాన్‌పూర్, జగదీష్‌పూర్ ప్రజల కోసం గాంధీ కుటుంబం ఏళ్ల తరబడి కష్టపడిందన్నారు. స్మృతి ఇరానీని గెలిపించి తప్పుచేశామని భావిస్తున్న అమేథి ప్రజలు గాంధీ కుటుంబం నుంచి ఒకరిని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేసి లోక్ సభకు వెళ్లే ఆలోచన తనకు ఉంటే కనుక, స్వయంగా తానే అక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని అమేథి ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. అమేథి కోసం తాము ఎంతగా కష్టపడ్డామో అక్కడి ప్రజలకు తెలుసునన్నారు. వారు సోషల్ మీడియాలో తనతో కనెక్ట్ అయి ఉంటారని, తన ఆఫీస్ బయట తనను కలుస్తుంటారని, తన పుట్టిన రోజు వేడుకలను నిర్వహిస్తారని తెలిపారు. అంతకుముందు, ప్రజలు కోరుకుంటే తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని 2022లో రాబర్ట్ వాద్రా అన్నారు.


More Telugu News