వాలంటీర్ల విషయంలో నాకు ఇదొక్కటే అభ్యంతరం: చంద్రబాబు

  • కొవ్వూరులో చంద్రబాబు ప్రజాగళం సభ
  • వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం సరికాదని స్పష్టీకరణ
  • వాలంటీర్లు తటస్థంగా ఉండాలని హితవు
  • తాము వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న టీడీపీ అధినేత
  • వాలంటీర్లను తొలగించబోమని హామీ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రజాగళం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని పవన్ కల్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారని, ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన మనిషి పవన్ కల్యాణ్ అని కొనియాడారు. కేంద్రంలో మళ్లీ వచ్చే పార్టీ బీజేపీయేనని... రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా కలిశాయని వెల్లడించారు. ఇక్కడ రాజమండ్రి నుంచి కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత పురందేశ్వరి పోటీ చేస్తున్నారని, రాజానగరం, నిడదవోలు అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారని వివరించారు. 

వాలంటీర్లు వైసీపీ కోసం పనిచేయడం న్యాయం కాదు

నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులతో రూ.5 వేల జీతం తీసుకుంటూ, ఒక రాజకీయ పార్టీ అయిన వైసీపీ కోసం పనిచేయడం న్యాయమా అని అడుగుతున్నా... ఈ మాటే నేను అడుగుతున్నా. మేం అధికారంలోకి వచ్చినా మిమ్మల్ని తీసెయ్యం... వాలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించడమే మీ విధి... ఈ మాటే నేను చెబుతున్నాను. ఎన్నికల సంఘం కూడా ఇదే చెబుతోంది... వాలంటీర్లు ఏ పార్టీకి మద్దతు ఇవ్వకూడదు, ఎన్నికలు అయిపోయేవరకు వీళ్లెక్కడా జోక్యం చేసుకోకూడదు, ఎన్నికలకు దూరంగా ఉండాలని ఈసీ చెప్పింది. ఇక అక్కడ్నించి జగన్ శవరాజకీయాలు బయల్దేరాయి. అంటే, పండుటాకుల వంటి ముసలివాళ్లను చంపేయాలని కక్షగట్టాడు. 

జగన్ రెడ్డికి అది అలవాటే!

జగన్ రెడ్డికి శవరాజకీయాలు చేయడం అలవాటు. వైసీపీ డీఎన్ఏలోనే శవరాజకీయం ఉంది. వాళ్ల వారసత్వమే శవరాజకీయం. ఎవరైనా మంచి పని చేసి, నాకు ఓటేయండి అని అడుగుతారు. కానీ కొందరు మనుషులను చంపేసి, దండేసి, ఎదుటివాళ్లపై ఆరోపణలు చేసి ఓట్లు అడిగే దుర్మార్గుడు ఈ జగన్ మోహన్ రెడ్డి. వీళ్ల తండ్రి హెలికాప్టర్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ, మా తండ్రిని రిలయన్స్ అధినేత చంపేశాడని అన్నాడా, లేదా? రిలయన్స్ షాపులపై దాడి చేశాడా, లేదా? మళ్లీ రిలయన్స్ వారికి ఒక ఎంపీ సీటు ఇచ్చాడా, లేదా? 

తండ్రి లేని బిడ్డను అని చెప్పి 2014లో ఓట్లు అడిగాడు. కానీ ప్రజలు నమ్మలేదు. కొత్త రాష్ట్రం కాబట్టి అనుభవజ్ఞుడైన చంద్రబాబు అయితేనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలడని నమ్మి మాకు ఓటేశారు... అందుకు కృతజ్ఞతలు. 2019 ఎన్నికల్లో మళ్లీ శవరాజకీయానికి తెరలేపాడు. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయ్ గొడ్డలివేటు. జగన్ మోహర్ రెడ్డీ... ఇప్పుడైనా చెప్పు... హూ కిల్డ్ బాబాయ్? ఈ దుర్మార్గుడు నారాసుర రక్తచరిత్ర అని దుష్ప్రచారం చేశాడు. ఇప్పుడు వాళ్ల చెల్లెలే చెబుతోంది... రక్తంతో మునిగిపోయిన వైసీపీకి ఓటేయొద్దని అంటోంది. హత్యలు చేసేవాళ్లు, శవరాజకీయాలు చేసేవాళ్లు మీకు కావాలా?

2024 వచ్చింది... మళ్లీ శవాల కోసం వెదుకుతున్నారు

2019 అయిపోయింది... ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చాయి. దాంతో మళ్లీ శవాల కోసం వెదుకుతున్నారు. వృద్ధులకు, వితంతువులకు రూ.35తో పెన్షన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రూ.200గా ఉన్న పెన్షన్ ను రూ.2000కి పెంచింది టీడీపీనే. ఈ దుర్మార్గుడు వచ్చి రూ.250 పెంచుకుంటూ పోతానని ఈ ఎన్నికల నాటికి ముక్కుతూ, మూలుగుతూ రూ.3000 చేశాడు. నేను ఉండుంటే మొదట్లోనే రూ.3000 పెన్షన్ ఇచ్చేవాడ్ని. రూ.1000 ఇచ్చి ఇంటింటికీ పోయి లక్ష సార్లు చెప్పాడు. అప్పట్లో రూ.2 వేల పెన్షన్ నేను ఇవ్వలేదంట... ఈయన ఇచ్చాడంట... అబద్ధాల కోరు!

జగన్... నువ్వు దద్దమ్మవి!

మీకు 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు... ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తే రెండ్రోజుల్లో పూర్తవుతుందని చెప్పాను. కానీ సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోమని చెప్పడంతో, సచివాలయానికి వచ్చిన వృద్ధుల్లో ఒకరిద్దరు చనిపోయారు. ఇవి కచ్చితంగా ప్రభుత్వ హత్యలే. జగన్ మోహన్ రెడ్డీ... నీకు పాలించడం చేతకాదు... దద్దమ్మవి నువ్వు. నీకు చేతనైతే  ఎవరినీ చంపకుండా పెన్షన్లు ఇవ్వు... నీకు చేతకాకపోతే పదవి లోంచి దిగిపో... ఒక్క గంటలో ఇళ్ల వద్దే పెన్షన్ల పంపిణీ ఎందుకు సాధ్యం కాదో నేను చూస్తా... ఇదే నా సవాల్. 

ఆ శవాన్ని తీసుకెళ్లి జగన్ ఇంట్లోనే పూడ్చేవాడ్ని!

జగన్ ఇంకో మాటకు కూడా భయపడిపోయాడు. నువ్వు పెన్షన్ ఇవ్వకపోతే, నేను వచ్చాక మొదటి నెల నుంచే రూ.4 వేల పెన్షన్ ఇస్తానని చెప్పడంతో భయపడ్డాడు. జగన్ నిన్న డబ్బులు విడుదల చేశాడు. ఇవాళ 80 శాతం మందికి పెన్షన్ ఇచ్చారు... ఈ బుద్ధి ముందేమైంది జగన్ మోహన్ రెడ్డీ? జగన్ ఇంకొక్క రోజు ఆలస్యం చేసుంటే... ఆ శవాన్ని తీసుకెళ్లి నేరుగా వాళ్లింట్లోనే పూడ్చేవాడ్ని... అప్పుడు బుద్ధి వచ్చేది. నువ్వు తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టేది లేదు. శవరాజకీయాలు చేసే ఫ్యాన్ ఆగిపోయింది. తిరగని ఫ్యాన్ ను ముక్కలు ముక్కలు చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఫ్యాన్ లాభం లేదు కాబట్టి నీ పార్టీ  గుర్తుగా గొడ్డలి తెచ్చుకో జగన్ మోహన్ రెడ్డీ.." అంటూ చంద్రబాబు ఆవేశంగా ప్రసంగించారు.


More Telugu News