కేటీఆర్ లీగల్ నోటీసుల ద్వారా బెదిరించాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

కేటీఆర్ లీగల్ నోటీసుల ద్వారా బెదిరించాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ కోసం తాము అడుగుతుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరమని వ్యాఖ్య
  • ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
  • ఆధారాలు చూపించినందునే పోలీసులు విచారిస్తున్నారన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇవ్వడం ద్వారా బెదిరించాలని చూస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పూర్తిస్థాయిలో విచారణ జరపాలని తాము డిమాండ్ చేస్తుంటే పరువు తీశారని కేటీఆర్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితులుగా తాము ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలు చూపించినందునే పోలీసులు విచారిస్తున్నట్లు చెప్పారు.

తాను కనుక కేటీఆర్ స్థానంలో ఉండి ఉంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పాత్ర లేదని పోలీస్ అధికారులకు లేఖ రాసి వివరణ ఇస్తానని తెలిపారు. కానీ కేటీఆర్ మాత్రం లీగల్ నోటీసులు ఇచ్చి బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డిలకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.


More Telugu News