అయ్యా రేవంత్ రెడ్డిగారూ... మీకు డిసెంబర్ 9 గుర్తు ఉందా? లేదా?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

  • అధికారం మత్తులో మునిగి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలులో పడి రుణమాఫీ హామీ మరిచిపోయారా? అని ప్రశ్న
  • డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్లేనా? అని ఆగ్రహం
  • కొత్త రుణాలు కావాలంటే, పాత అప్పు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు రైతుల మెడపై కత్తి పెట్టి వేధిస్తున్నారని వ్యాఖ్య
'అయ్యా... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ... మీకు డిసెంబర్ 9 గుర్తు ఉందా? లేదా? అధికారం మత్తులో మునిగి, ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలులో పడి ఆ తేదీని... రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ మరిచిపోయారా? ' అని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరగానే డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ అటకెక్కినట్లేనా? అని మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయంగా కొత్త రుణాలు కావాలంటే, పాత అప్పు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు రైతుల మెడపై కత్తి పెట్టి వేధిస్తూ, వసూలు చేస్తున్నారని విమర్శించారు. మరి సీఎం రేవంత్ రెడ్డికి డిసెంబర్ 9, ఆ రోజున రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీ గుర్తు లేదా? అని ప్రశ్నించారు.

అధికారం దక్కగానే ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వాటిని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్‌కు రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అన్నదాతలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అన్నదాతల ఆగ్రహానికి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.


More Telugu News