ముంబై ఇండియ‌న్స్‌కు గుడ్‌న్యూస్‌.. సూర్యకుమార్ యాద‌వ్ వ‌చ్చేస్తున్నాడు!

  • ఎన్‌సీఏలో అన్ని ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు పూర్తి చేసుకున్న సూర్య‌కుమార్‌
  • గురువారం అతనికి ఒక రొటీన్ టెస్టు చేయ‌నున్న ఎన్‌సీఏ 
  • ఆర్‌టీపీ (రిట‌ర్న్ టు ప్లే) స‌ర్టిఫికేట్ కోసం ఈ టెస్టు త‌ప్ప‌నిస‌రి
  • ఆ త‌ర్వాత‌ ఎన్‌సీఏ నుంచి క్లియరెన్స్ స‌ర్టిఫికేట్ రావ‌డ‌మే ఆల‌స్యం ముంబై జ‌ట్టుతో చేర‌నున్న సూర్య‌
ఈ ఐపీఎల్ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మూడు మ్యాచుల్లో ముంబై ఇండియ‌న్స్ (ఎంఐ) ఓట‌మి చ‌విచూసిన విష‌యం తెలిసిందే. ఇలా వ‌రుస ఓట‌ముల‌తో డీలా ప‌డ్డ ఎంఐకి ఇప్పుడు ఓ గుడ్‌న్యూస్ అని చెప్పాలి. ఆ జ‌ట్టు కీల‌క ఆట‌గాడు, వ‌ర‌ల్డ్ నం.01 టీ20 ప్లేయ‌ర్ సూర్యకుమార్ యాద‌వ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ప్ర‌స్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) లో ఉన్న సూర్య కుమార్.. అక్క‌డ అన్ని ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు పూర్తి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఒక రొటీన్ టెస్టు మాత్ర‌మే మిగిలివుందట‌. అది గురువారం జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత‌ ఎన్‌సీఏ నుంచి క్లియరెన్స్ స‌ర్టిఫికేట్ రావ‌డ‌మే ఆల‌స్యం సూర్య‌కుమార్ ముంబై జ‌ట్టుతో చేరుతాడు. ఎంఐ త‌న త‌ర్వాతి మ్యాచ్‌ల‌ను 7వ తేదీన ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో, 11వ తేదీన‌ ఆర్‌సీబీతో ఆడ‌నుంది. డీసీతో మ్యాచులో అత‌డు బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.  

ఇక సూర్య చేరిక ముంబైకి క‌లిసి రానుంది. వ‌రుస ఓట‌ముల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న ఎంఐకి సూర్య‌భాయ్ బూస్ట్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, సూర్య‌కుమార్ గ‌తేడాది డిసెంబ‌ర్‌లో ద‌క్షిణాఫ్రికాపై చివ‌రి సారిగా క్రికెట్ ఆడాడు. ఆ త‌ర్వాత చీల‌మండ గాయంతో ఆట‌కు దూర‌మ‌య్యాడు. అప్ప‌టి నుంచి ఎన్‌సీఏలోనే ఉండి గాయం నుంచి కోలుకుంటున్నాడు. 

"సూర్య అన్ని టెస్టులు పూర్తి చేసుకున్నాడు. ఒక రోటిన్ టెస్ట్ మిగిలింది. అయితే, ఎన్‌సీఏ నుంచి ఆర్‌టీపీ (రిట‌ర్న్ టు ప్లే) స‌ర్టిఫికేట్‌కు ఈ టెస్టు త‌ప్ప‌నిస‌రి. ఇది గురువారం నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. దీని త‌ర్వాత అత‌ని పూర్తి ఫిట్‌నెస్‌పై ఒక అంచ‌నా వ‌స్తుంది. ఇప్ప‌టికైతే అత‌డు సౌక‌ర్య‌వంతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు" అని పీటీఐ ప్ర‌తినిధి ఒక‌రు పేర్కొన్నారు. 

ఇదిలావుంటే.. సూర్య‌కుమార్ తిరిగి ముంబై ఫ్రాంచైజీతో చేరితే తుది జ‌ట్టులో త‌ప్ప‌నిస‌రిగా ఉంటాడు. అయితే, నెట్‌లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న ఆధారంగా జ‌ట్టు నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంటుంది. అత‌డు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడితే 7న‌ ఢిల్లీతో మ్యాచులో బ‌రిలోకి  దిగే అవ‌కాశం ఉంది. లేక‌పోతే నాలుగు రోజుల త‌ర్వాత 11న ఆర్‌సీబీతో మ్యాచులో ఆడ‌తాడు.


More Telugu News