చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్న రఘురామకృష్ణరాజు.. ఉండి నుంచి పోటీ?

  • శుక్రవారం టీడీపీలో చేరనున్న రఘురాజు
  • ఈరోజు భీమవరం వెళ్తున్న నర్సాపురం ఎంపీ
  • మంగళవారం రాత్రి చంద్రబాబుతో భేటీ అయిన రఘురాజు
ఏపీ రాజకీయాలలో ఎంపీ రఘురామకృష్ణరాజుది ఒక ప్రత్యేకమైన స్థానం. ముఖ్యమంత్రి జగన్ ను ధైర్యంగా ఎదుర్కొన్న నేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరపున పోటీ చేస్తానని ఆయన ఎన్నో సార్లు చెప్పారు. అయితే ఆయనకు టికెట్ దక్కలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సాపురం లోక్ సభ టికెట్ ను బీజేపీ శ్రీనివాస్ వర్మకు కేటాయించింది. దీంతో, ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ తనకు టికెట్ వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తూ వచ్చారు. 

తాజాగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయనకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో రఘురాజుకు చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పినట్టు సమాచారం. ఉండి నియోజకవర్గం నుంచి రఘురాజును టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడుతున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగే సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో రఘురాజు చేరనున్నట్టు సమచారం. ఈరోజు రఘురాజు భీమవరం వెళ్తున్నారు. ఈ సందర్భంగా భీమవరం, ఉండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది.


More Telugu News